
- రూ.32,500 కోట్లతో 2,339 కి.మీ మేర రైల్వే నెట్‌వర్క్ విస్తరణ
- పట్టణాల్లో 10 వేల ఇ-బస్సులు శ్రీ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులను రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయనుంది. బుధవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌ను 2,339 కిలో మీటర్ల మేర విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ పనులతో ఆయా రాష్ట్రాల్లోని కార్మికులకు 7.06 కోట్ల పనిదినాల వరకూ ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు. ప్రధానంగా గుంటూరు- బీబీ నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ.3,238 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ముద్కేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ కు ఆమోదం లభించింది. దీనివల్ల హైదరాబాద్-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డిపిఆర్ సిద్ధం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.
పిఎం ఈ-బస్ సేవ కింద 10 వేల ఈ-బస్సులు
పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా 'పిఎం ఈ-బస్ సేవ' పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10 వేల ఇ-బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 169 పట్టణాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇందుకోసం రూ.57,613 కోట్లు వెచ్చిస్తామని, ఇందులో రూ.20 వేల కోట్లను కేంద్రమే సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. 45 వేల నుండి 55 వేల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. 181 నగరాల్లో గ్రీన్ ఇ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది.
డిజిటల్ ఇండియాకు రూ.14,903 కోట్లు
డిజిటల్ ఇండియా పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫేజ్ (ఐఎస్‌ఈఎ) ప్రోగ్రామ్ కింద 2.65 లక్షల మందికి శిక్షణ అందిస్తారు. 1,787 విద్యాసంస్థలను అనుసంధానించి పనిచేస్తున్న నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (ఎన్ కె ఎన్) ఆధునికీకరణ చేస్తామన్నారు. డిజి లాకర్ కింద డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సదుపాయం ఇకపై ఎంఎస్‌ఎంఈ, ఇతర సంస్థలకు అందుబాటులోకి వస్తుంది. టైర్ 2, 3 నగరాల్లో 1,200 స్టార్టప్‌లకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
'విశ్వకర్మ'కు రూ.13 వేల కోట్లు
మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విశ్వకర్మ పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 'గరిష్ఠంగా 5 శాతం వడ్డీరేటుతో లక్ష రూపాయిల వరకు ఈ రుణాలు పొందవచ్చు. ఇందుకోసం రూ.13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనుంది'' అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి విడత రుణం సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ. 2 లక్షల రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో ఒబిసి సామాజిక తరగతికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకులు, పడవల తయారీదారులు, తదితర వృత్తిదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.