Oct 01,2023 22:15

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరను కేంద్రం ఆదివారం పెంచింది. వెంటనే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. కమర్షియల్‌ సిలిండర్‌ కేంద్రం ఒక్కసారిగా రూ.200కుపైగా పెంచింది. ప్రతినెలా ధరల సవరణలో భాగంగా ఆదివారం వీటిని పెంచినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. తాజా పెంపుతో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర గుంటూరులో రూ.1916.50కు, కృష్ణా జిల్లాలో 1888.50కు, విశాఖలో 1789కి, పశ్చిమ గోదావరిలో రూ.1912కు పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే... ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,731కు, చెన్నైలో రూ.1,898కు చేరింది. కోల్‌కతాలో రూ.1839.50గా ఉండగా, ముంబయిలో రూ.1684కు చేరింది. ధరల పెంపుతో కాఫీ, టీలు, టిఫిన్లు, భోజనాలు, ఇతర తినుబండారాల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని హోటళ్ల నిర్వాహకులు, తినుబండారాల తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఈ భారం మరింత ప్రభావం చూపనుంది.