
గత పాతికేళ్ళుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కిడ్నీ వ్యాధులతో, మరణాలతో సతమతమవుతోంది. ఒకప్పుడు వామపక్ష ఉద్యమ త్యాగాలతో తడిచిన నేల అది. నేడు ఈ ప్రాంత వాసులు నిత్యం పేదరికంతో పొట్ట కూటి కోసం దేశ విదేశాలకు వలసపోతున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ వ్యాధి ఉద్దానంలో ఒక నిశ్శబ్ద మరణ శాసనంలా మారింది. అక్కడ ఏ గ్రామాన్ని పలకరించినా భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు. ఇలా 7 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల పైబడిన వారి వరకు... స్త్రీ పురుష భేదం లేకుండా... నిత్యం చావు డప్పు మోగుతునే ఉంది. ఈ వ్యాధిని ''క్రానిక్ కిడ్నీ డిసీజ్'' గా పేర్కొంటారు.
ప్రజా సంఘాలు, రచయితలు, స్వచ్ఛంద సంస్థల అవగాహనా సదస్సులు, పత్రికలు, మీడియా నిరంతర కథనాలు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వంటి వారి రాకతో ప్రభుత్వంలో కదలిక వచ్చి దేశ, విదేశీ (అమెరికా) వైద్యులు పరీక్షలు చేశారు. అయినప్పటికీ ఈ ప్రాణాంతక వ్యాధికి కారణాలేమిటనేది ఇదమిద్దంగా ఇప్పటికీ తెలియడం లేదు.
తాగే నీరా? బి.పి, షుగర్ వ్యాధులా? పంటలకు కొట్టే పురుగు మందులా? ఏదీ నిజ నిర్ధారణ కాలేదు. అటు ఇచ్చాపురం నుండి ఇటు టెక్కలి మండలం వరకు ఉద్దానం గ్రామాలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత 25 సంవత్సరాలలో 35 వేల మరణాలు సంభవించాయని ప్రజా సంఘాల సర్వేలు చెబుతున్నాయి. మృతులలో శాసనసభ్యులు, సర్పంచ్ స్థాయి నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, కళాకారులు కూడా ఉన్నారు. భర్త కోసం భార్య కిడ్నీ దానం చేసినా దక్కని భర్త, కొడుకు కోసం కిడ్నీ దానం చేసినా ప్రాణాలు దక్కించుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వాలు స్పందించి పలాసలో కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాయి. కవిటి, సోంపేట, హరిపురం, పలాస, టెక్కలి, పాలకొండలలో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పినా అక్కడ పూర్తి స్థాయి వైద్యులు లేరు. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10,000 ఇస్తున్నా వారి మరణాన్ని నివారించలేకపోతున్నారు.
కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో సగటున నెలకొకరు మరణిస్తూనే ఉన్నారు. మరికొంత మంది డయాలసిస్ చేయించుకుంటూ, మరణానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాధితో మరణించే వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా వుంటోంది. నిత్యం మరణాలతో మండుతున్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టలేదు. రాబోయే తరాలను ఈ వ్యాధి నుండి కాపాడడానికి తీసుకొనే చర్యలేమిటో తెలియడం లేదు. ఎంతమంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారో సర్వే చేపట్టలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్దానం ప్రాంతంలో ప్రతి గ్రామంలో వ్యాధిగ్రస్తులను గుర్తించాలి. పరీక్షలు జరిపించి ముందుగానే ఈ వ్యాధి భారిన పడకుండా చర్యలు చేపట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. పరిశోధన కేంద్రంలో వెంటనే పరిశోధనలు ప్రారంభించి వ్యాధికి కారణాలు తెలియజేయాలి. ప్రజలలో అవగాహనా సదస్సులు నిర్వహించి ఈ ప్రాంతం మరో శ్రీలంకలా కాకుండా చూడాలి.
- బద్రి కూర్మారావు, ఉద్దానం విద్యావంతుల వేదిక, సెల్ : 9704798643