Feb 12,2021 07:13

నేనున్నా...నే చూస్తా...అన్న రాజుగారి మాటలతో ఉబ్బి తబ్బిబ్బయిన ఊరి కుర్రాళ్లలో కొందరికి ఉపాధొచ్చింది. ఇంటింటికీ తిరిగి పెబుత్వం చేసే పనులను అందరికీ చెప్పడంతోపాటు...అన్ని పనులూ చేసే పని చేతికొచ్చింది. అందరికీ సేవ చేయడం... చెప్పడం బాగానే ఉంది. పని చేయాలి కాని బతకడానికి జీతమడగ కూడదంట. లక్షలాది ఉద్యోగాలని ఎగబడి వచ్చినందుకు పనికి జీతమివ్వాలనే నిబంధనకు నీళ్లొదిలారు. పని చేయడం తప్ప ఫలితమడగకూడనే కొత్త చట్టాన్ని పరిచయం చేశారు. ఏమీ చేయకపోయినా ఎమ్మెల్యేలు..ఎంపిలకు ఎంతగాదన్నా ఏడాదికి 25 లచ్చలొత్తాయి. అసెంబ్లీ మీటింగుకు పోయి సంతకం పెట్టొత్తే రోజుకు ఎనిమిది వందలు. నెలంతా ఇంటింటికీ తిరిగి చేసినా 'జీతం ఇవ్వండి మహాప్రభో' అంటే 'అబ్బే అదేటి లేదు... చేయండి సూద్దాం' అనే తియ్యటి కబుర్లు చెప్పి ఇంటికి పొమ్మంటున్నారు. ఈ కబ్లుర్లేమన్నా కడుపు నింపుతాయా... అంటే పనీ లేదు గినీ లేదు ఇంటికి పొమ్మంటున్నారు. ఇదేందయ్యా అంటే ఉత్తరం ఇచ్చి చదువుకోమంటున్నారు.
అదేలేండీ ఏదైనా కొత్తదనం కోసం కార్యక్రమాల చిట్టా ఒకటి రాసిపెట్టి... కొత్త కొత్త కార్యక్రమాలు కనిపెట్టి, వాటికి కొంతమందిని కట్టబెట్టి, ఇళ్లను అంటగట్టి... ఇంటింటికీ తిరగకపోతే తిట్టీ తిట్టనట్లు తిట్టి...మీరు లేకపోతే పాలన లేదని టీవీల్లో తొడలు కొట్టి మరీ చెప్పి. ఉదయానే అగ్గిపెట్టెలిత్తున్నాను. అన్ని ఇళ్లలో పొయ్యికి నిప్పెట్టండి. మీరు నిప్పెడితే వారొండుకుంటారు... లేకపోతే మిన్నకుంటారు. కాబట్టి మీరే దేవుళ్లు...దేవతలూ గట్రా అనుకోండి. పొద్దున్నుండి సాయంత్రం దాకా చేయండి. ఇచ్చింది తీసుకోండి. అంతేగానీ అడగకండి. మీరు సమాజంలో అత్యంత మర్యాదస్తులు. పని చేసేవారు. విక్రమార్కులే...కాకపోతే ఆయన శవాన్ని భుజానేసుకున్నాడు. మీరు ట్యాబు, ఫోను, పేపరు, పెన్ను, ఇప్పుడు బస్తాలు గట్రా భుజానేసుకుంటున్నారు. అంతే చిన్న తేడా. కానీ వారికిచ్చే భత్యం చాల్లేదంటే సమాజ సేవ. మీరందరూ సేవకులు. ఏమనుకున్నారు అంటూ రాజుగారు సెలవిచ్చేశారు. స్వచ్ఛంద సేవకులుగా ఉన్నోళ్లంతా 'ఏదో చేస్తే ఏదో వస్తుందనుకుంటే' అనుకుంటూ నీరసించి చెట్టు కింద... రచ్చబండ దగ్గరా... కాలనీకి పోయే కట్ట మీదా గూసుని ఏందిరా కథ అనుకుంటూ కాళ్లు బార్లా జాపి, రాజుగారి శ్రీముఖాన్ని ముఖానికి ముందు పెట్టుకుని చదువుకుంటూ సతికిలబడ్డారు.
ఒకరి ముఖం లోకి ఒకరు జూసుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇప్పుడు సెప్పేది ఏమిటంటే ఉదయం నుండి సాయంత్రం వరకూ అమ్మా బాగుందా... అయ్యా బాగున్నారా... మీ ఇంట్లో పెన్షనొచ్చిందా... కోటా తీసుకున్నారా... డోక్రా రుణాలు తీసుకున్నారా... ఇన్సూరెన్సు కట్టాలంటా మీరు ఇంటి దగ్గర ఉంటే వచ్చి కట్టించుకుంటా పిన్నీ...అని చెప్పే పనులన్నీ ఇప్పుడు స్వచ్ఛంద సేవగా మారిపోయాయి. కొత్తగా రాష్ట్రంలో స్వచ్ఛంద సేవకులు ఉచిత సేవా పథకం కూడా మొదలైంది.
మీరు సేవకులు. అలా అడగకూడదు. తప్పని అంటారు. గ్రామ, వార్డులో ఉండే అన్ని ఇళ్లకూ పని చేసేది స్వచ్ఛంద సేవకులా. జీతమడిగితే మీరసల లెక్కలో లేనోళ్లంటూ లేఖలు పంపుతారా. అయ్యా పెద్దాయనా ఒక్కరోజు ఓట్లేస్తే గెలిచిన పెజా పెతినిధులందరూ నెలకు లచ్చలు లచ్చలు తీసుకుంటారా. తీసుకోకపోతే ఫోన్‌ చేసి మరీ ఇస్తారా. మాకేమో అడిగినా ఇవ్వరా. పైగా సేవకులంటారా. సేవ సేత్తామని చెప్పి ఓట్లడిగి గెలిచిన తరువాత కరోనా దెబ్బకు కంగారుపడి...గదిలో నుండి బయటకు రాకుండా ఇంట్లోనే కూసుంటే మేమెళ్లి ఇంటింటికీ తిరిగి సారు రమ్మన్నారని చెబితే ఇంట్లో కూసుకుని కిటికీలో నుండి మాట్లాడి పంపిచే మీకేమో లచ్చలు...లచ్చలా. మాకేమో బెదిరింపులా. ఇదేంది నాయానా. ఇన్నాళ్లూ సేవంటే మంచిపని అనుకున్నాముగానీ, ఎమ్మెల్యేలు... ఎంపిలు... మంత్రులను ఇంట్లో కూసోబెట్టి కాపలా కాసే పననుకోలా. అనుకుంటూ సతికిలపడ్డోళ్లందరూ సంచులు సర్దుకుని ఇంటింటి వార్డు వాలంటరీ పనికి బయలుదేరారు.... మళ్లా ఇంకో లెటరొత్తదనే బయంతో.
మనోళ్లు మామూలోళ్లు కాదుగా నిదరపోయే వాడిని లేపి మరీ నిద్ర పోతున్నారా అని...అన్నం తినేవాడి దగ్గరకెళ్లి ఎదురుగా కూర్చుని ఓహో అన్నం తింటున్నారా.. అని అడిగి అవతలోడు అవును అంటేగానీ తృప్తి తీరని మనుషులం కదా అంతే ఉంటాది..!

                                                                                                                   -అభిజ్ఞ