కేరళ వామపక్ష ప్రభుత్వ తరహాలో ఉపాధి హామీ కూలీలకు సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేయాలి : ఏపీ వ్య.కా.సంఘం
ఇరగవరం-రేలంగి (పశ్చిమ గోదావరి) : కేరళ వామపక్ష ప్రభుత్వ తరహాలో ఉపాధి హామీ కూలీలకు సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇరగవరం మండలం రేలంగి పంచాయతీ పరిధిలో గోదావరి అట్టల ఫ్యాక్టరీ సమీపంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలసి వారితో కొద్దిసేపు మాటా మంతి నిర్వహించారు. ఉపాధి పనుల ప్రారంభంలో కొంతమందికి మాత్రమే ప్రభుత్వం పనిముట్లు ఇచ్చి మిగతావారికి ఎవరికి ఇవ్వలేదని. పనిముట్లు సొంత డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందని వీరభద్ర రావు వద్ద చెప్పి కూలీలు వాపోయారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో. పని చేస్తున్న కూలీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి బోర్డు ఉపాధి కూలీలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని వివరించారు. మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలీలకు ఉపయోగపడే సంక్షేమ నిధి బోర్డుని అమలులోకి తీసుకువచ్చి అమలు చేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో వస్తున్న అనేక మార్పుల వలన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనిదినాలు తగ్గిపోవడం వలన అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వీరభద్రరావు చెప్పారు. అందుకు. ఆర్థిక వెనకబాటుతనం ఉన్న కూలీల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ నిధి బోర్డు ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు ఉపాధి హామీని మరింత విస్తరించి గ్రామీణ ప్రజలకు కొనుగోలు శక్తి పెంచే విధంగా 200 రోజులు పని కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలని, 30 రోజులు పని పూర్తి చేసిన ప్రతి కుటుంబానికి చట్ట ప్రకారం పనిముట్లు ఇవ్వాలని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని. కోరుతూ ... పని ప్రదేశం వద్ద పనిముట్లతో కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంట సౌజన్య, చేబ్రోలు సుధారాణి, బూర మాణిక్యాలరావు, గంటా రమేష్, యార్లగడ్డ లలిత, రెడ్డి మిల్లి ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.










