- మతాతీత ఐకమత్యంతోనే విజయవంతం : విజయన్
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కార్యక్రమం కుటుంబ శ్రీకు బుధవారంతో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొని ప్రసంగించారు. కేరళలో మతాలకతీతంగా ఉన్న ఐకమత్యంతోనే కుటుంబశ్రీ విజయం సాధ్యమయిందని అన్నారు. మహిళలు వ్యాపారరంగంలోకి ప్రవేశించినప్పుడు అనేక మంది అనేక సందేహాలను వ్యక్తం చేశారని, అయితే కుటుంబ శ్రీ విజయవంతంతో మహిళలు దానికి సమాధానం చెప్పారని విజయన్ తెలిపారు. అలాగే 2025వ సంవత్సరం నాటికి అతిదారిద్య్రం లేని రాష్ట్రంగా కేరళ మారుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఘనత సాధించడంలో కుటుంబ శ్రీ పాత్ర చాలా కీలకమని తెలిపారు. 1998 మే 17న కుటుంబ శ్రీ కార్యక్రమం ప్రారంభమయింది. వంటగది నాలుగు గోడల మధ్య మగ్గుతున్న మహిళలకు ఉపాధి ఆదాయం, ఆర్ధిక స్వాలంభన సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇందులో 45 లక్షలకు పైగా మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల సంయోజనంతో అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో అత్యంత ప్రముఖమయింది ప్రజాహోటల్. అలాగే న్యూట్రిమిక్స్, హరితకర్మసేన, మహిళా భవన నిర్మాణ యూనిట్లు, ఎయిర్ స్టార్క్ టాస్క్ టీములు వంటి కూడా విజయవంతమయ్యాయి. రాష్ట్రంలోని 24 రైల్వే స్టేషన్లలో కొచ్చి వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న ఉపజీవన పథకంలో 73 వేలకు పైగా సంఘాల్లో 3 లక్షలకు పైగా మహిళా సభ్యులు ఉన్నారు.










