
ఢిల్లీలో రైతుల పోరాటానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి రైతు చట్టాలను రద్దు చేస్తున్నామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేర్కొంది. ఆచరణలో మాత్రం మద్దతు ధరల చట్టాలు తీసుకురాకపోగా వ్యాపారులకు, కార్పొరేట్లకు లాభాలు తెచ్చిపెట్టే పద్ధతులను అమలు చేస్తోంది. ఈ విధానాల ఫలితంగా రైతులకు మద్దతు ధర అందకపోగా వ్యాపారులకు లాభాలు కురిపిస్తోంది.
కృష్ణా, పశ్చిమ డెల్టాలో ప్రధానంగా సాగయ్యే వరి, వాణిజ్య పంటయిన పసును ధరలను, సాగు చేస్తున్న రైతులను పరిశీలిస్తే ఇది మనకు ఇంకా క్షుణ్ణంగా అర్థమవుతుంది. అప్పటి టిడిపి ప్రభుత్వం కేంద్రం ఆదేశాల మేరకు పసుపు పంటలో ఈనామ్ పద్ధతి తెచ్చింది. దీనివల్ల పసుపు రేట్లు పడిపోయాయి. 2017-18లో టిడిపి ప్రభుత్వం కొమ్ములు రూ.6500, కాయ రూ.6000 చొప్పున 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 2019-20లో నేటి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 2020-21లో క్వింటాలు కొమ్ములు రూ.6850, కాయ రూ.6500 చొప్పున...కొమ్ములు 1508 క్వింటాళ్లు, కాయలు 664 క్వింటాళ్లను రూ.15 కోట్లు వెచ్చించి కొన్నది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు చాలా తక్కువ. మరొక విషయం ఏమిటంటే మార్కెట్‌లో ప్రభుత్వం కొనుగోళ్లు జరుపుతుంటే బయట ఎంతో కొంత రేట్లు పెరగాలి. అది జరగలేదు. దీనివల్ల పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం రైతుల కోసం కనీసం రూ.100 కోట్లను ఎందుకు ఖర్చు చేయలేకపోయిందో తెలియడం లేదు.
పసుపు ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగాయి. కౌలుతో సహా ఏడాదికి రూ.1.50 లక్షల నుండి రూ.1.60 లక్షల వరకూ ఖర్చవుతోంది. కృష్ణానదీ పరీవాహక లంక భూముల్లో ఎకరానికి దిగుబడి 20 నుండి 25 క్వింటాళ్లుగా ఉంటుంది. డెల్టా భూభాగంలో 15 నుండి 20 క్వింటాళ్లు దిగుబడి ఉంటుంది. 20 క్వింటాళ్లు పండినా సగటు ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు రూ.7,500గా ఉంది. 15 క్వింటాళ్లు పండితే క్వింటాలు ఉత్పత్తి ఖర్చు 10 వేలుగా ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా సగం కలిపి కొనుగోలు జరగాల్సి ఉంది. అంటే కృష్ణానదీ లంక భూముల్లో క్వింటాలు రూ.11,250 ఉండగా కొనుగోలు జరగాలి. ఆరేడు సంవత్సరాల మొత్తంలో గరిష్ట ధర రూ.7,000 ఒకరోజు మాత్రమే పడింది. మరలా ఎప్పుడూ అంత రేటు రాలేదు. పసుపు రైతులు ఈనామ్ తర్వాత పూర్తిగా దెబ్బతిన్నారు. వేలా ది రూపాయలు నష్టపోయారు. ప్రస్తుతం దుగ్గిరాల యార్డులో సగటు ధర రూ.5,500 నుండి రూ.6,500 దాకా ఉంది.
- వరి పంటలోనూ అదే పరిస్థితి
ఖరీఫ్‌లో వరి దిగుబడి 2021 డిసెంబరు, 2022 జనవరిలో వచ్చింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుని పరిశీలన చేయగా మొత్తం పంట 21 వేల ఎకరాల్లో వేశారు. సగటు దిగుబడి 30 బస్తాలుగా అధికారులు చెప్పారు. అయితే గతంలో ఎక్కువమంది నిల్వబెట్టి ధర కొంచమైనా పెరిగిన సమయం చూసుకుని అమ్ముకునే వారు. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల నిల్వబెట్టుకునే ధైర్యం రైతులు చేయలేకపోయారు. ఎక్కడికక్కడ అమ్ముకున్నారు. మొత్తం ఉత్పత్తిలో నిల్వబెట్టుకున్న వరి దిగుబడి ఐదు శాతం లోపే ఉంటుంది. మొత్తం దిగుబడిలో 15 వేల బస్తాలను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు మిల్లర్లకు అమ్మించారు. మిగిలిన పంటనంతా బస్తా రూ.900 నుండి వెయ్యి రూపాయల మధ్య కొన్నారు. దానిలోనే కాటా ఖర్చులు (అంటే ప్రతి బస్తాకి రూ.50) తగ్గించి డబ్బులిచ్చారు. తెనాలి ప్రాంతంలో కుప్పల మీద నిల్వ బెట్టుకొన్న వారి వద్ద నుండి బస్తా రూ.1200 చొప్పున కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుత ధాన్యం రూ.2200 పైనే ఉంది. ఈ పరిస్థితి ఎందుకేర్పడింది? రైతుకి మద్దతు ధర వద్దనుకున్నారా? ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నట్లు? మద్దతు ధర రూ.1400 ఉన్నా గత్యంతరం లేక రూ.900 నుండి రూ.1000 మధ్యనే అమ్ముకున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక బస్తా ధాన్యం ఉత్పత్తికే రూ.1000 ఖర్చవుతుంది. ఇది ఎరువులు సాధారణ ధరల్లో ఉన్నప్పుడు. కానీ ఏడాది ఎరువుల కొరత పేరుతో దాన్ని కూడా వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్మారు. కొన్ని సందర్భాల్లో బ్లాక్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోకపోవడంతో అది కూడా ఉత్పత్తి ఖర్చుల్లో పెరిగి భారంగా మారింది. దీని బట్టి మద్దతు ధర ఇంకా పెరగాల్సి ఉంది. సరాసరిన మద్దతు ధర రూ.1500 లేదా అంతకంటే మరో వందో రెండు వందలో ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఆ రేటు రైతులకు గిట్టేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఉత్పత్తి సమయంలో ఖర్చులు పెరిగే కొద్దీ కౌలుదారులు, పేదరైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎక్కువ వడ్డీ అయినా సాగుపై ఆశతో రైతులు వారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ప్రభుత్వమే బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాల్సి ఉంది. ఆ పని ప్రభుత్వం చేయలేదు. దీనివల్ల అనివార్యంగా పంట ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోంది. దిగుబడి ఆ మేరకు ఉండటం లేదు. ఒకవేళ వచ్చిన దిగుబడిలోనూ తేమ శాతం కొంచం ఎక్కువగా ఉన్నా రైతును ఒప్పించి ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి. కానీ ఆ పనీ చేయడం లేదు. రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ధాన్యం ఆరబెట్టుకోవడం, గోతాలు, నిల్వ చేసుకునే విధానం లేకపోవడం, అప్పులు ఇచ్చిన వారు వెంటబడటం, పంటను చేలోనే ఉంచితే భూమి ఆరక రెండో పంట దిగుబడి రాదేమోననే భయం, ఒక వేళ ఆరబెట్టుకున్నా ప్రభుత్వం కొంటుందో లేదో అనే ఆందోళన, కొన్నా డబ్బులు ఎప్పుడు వస్తాయో అనే భయం రైతును చేతికొచ్చిన వెంటనే పంట అమ్ముకునేలా చేస్తోంది.
- పంటల కొనుగోళ్లలో ప్రభుత్వాలు తెస్తున్న మార్పులు
పసుపు, మిర్చి పంటల మీద ఈనామ్ పద్ధతి తెచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రైతులు కోలుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేయలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రైతులను నట్టేట ముంచే చట్టాలను బలపర్చారు. ప్రభుత్వం ఇ ఫారమ్ అనే వ్యాపార పద్ధతిని తీసుకొచ్చింది. మన రాష్ట్రంలో ఈ వ్యాపారం బాధ్యతను నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీకి ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని ప్రకారం రైతు పంటను మార్కెట్‌కు తీసుకురానక్కర లేదు. మార్కెటింగ్ శాఖ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ల సహకారంతో రైతుల దగ్గరకెళ్లి నాగార్జున ఫెర్టిలైజర్స్ వారు తయారు చేసిన యాప్‌లో పంటను, రైతు చెప్పిన రేటును యాప్‌లో పెడతారు. దీన్ని కొందామనుకున్న సంస్థలు కొనుగోలు చేస్తాయి. యాప్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు రైతు ఇష్టపడితే అమ్మకం జరుగుతుంది. మార్కెట్ యార్డుకు ఒక శాతం పన్ను, జియస్‌టి వసూలు చేస్తారు. కార్పొరేట్లకు- రైతులకు మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న నాగార్జున ఫెర్టిలైజర్స్ సంస్థకి 0.67 శాతం కమిషన్ కూడా తీసి ఇవ్వాలి. అసలు రైతులకు మద్దతు ధర లభిస్తుందా? లేదా? మార్కెట్ యార్డులు ఉంటాయా? ఉండవా? ఇప్పటి దాకా పంటలను కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ ఉంటుందా? ఉండదా? రైతు నుండి పంట కొనుగోలు చేసిన వారు మోసం చేస్తే ఆ బాధ్యత ఎవరిది? ఒక రైతు చెప్పే రేటు మరో రైతుకి తెలియని పరిస్థితి కూడా ఉంది. రైతులు ఐక్యంగా రేటు తెచ్చుకునే పరిస్థితి దెబ్బ తింటుంది. రైతుకు గిట్టుబాటు కాని ఏ వ్యాపారమైనా నష్టమే. పంటను ఎంత తక్కువకు కొనుగోలు చేస్తే కార్పొరేట్లకు అంత లాభమే. అదే మార్క్‌ఫెడ్ అయితే సిబ్బంది యార్డుల్లో ఉంటారు. వారు మద్దతు ధరకే కొంటారు. రైతులకు అందు బాటులో ఉంటారు. చెప్పిన టైముకు డబ్బులు రాకపోతే యార్డుకి వెళ్లి డబ్బులు అడిగి వస్తారు. ఈ పద్ధతిని ఎందుకు మార్చుతున్నారో! ఇ-ఫారమ్ వ్యాపారమే ఆచరణలోకి వస్తే మద్దతు ధర ఉంటుందా? రైతులు పంటను అమ్ముకోవడానికి గ్యారెంటీ ఉంటుందా? అసలు మార్క్‌ఫెడ్ ఉండగా ఇలాంటి వ్యాపారాలు ఎందుకు? మాది రైతు ప్రభుత్వం అని మాటల్లో చెబితే కుదరదు. రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టడం అవసరం.
/ వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు /