Jul 14,2023 14:41

ప్రజాశక్తి-కవిటి : జీడి రైతుల సమస్యలపై జులై 18న మహాధర్నా జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తేప్పల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలో జీడి మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వమే ఆర్బికేలు ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ జీప్ యాత్రను రైతుసంఘం సీనియర్ నాయకులు పాతిన.కృష్ణమూర్తి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి రైతులు మద్దతు ధర లేక తీవ్ర దోపిడీకి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జీడికి ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదని వారు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండతో జీడి పరిశ్రమ యజమానులు రైతాంగానికి తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని వారు విమర్శించారు .ఒకవైపున జీడి పప్పు ధర పెరుగుతూ ఉంటే మరొకవైపున జీడిపిక్కల ధర తగ్గుతూ వచ్చిందని దీనికి కారణం జీడివ్యాపారులు సిండికేట్ గామారి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. 2019లో 14000 ఉన్న జీడిపిక్కల ధర నేడు 7500 నుండి 8,000 ధర ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. అదే విధంగా జిల్లాలో మంత్రులు స్పీకర్ జీడి సమస్యపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జీప్ జాతా ద్వారా గ్రామాలన్నీ పర్యటించి 18వ తేదీన కాశీబుగ్గ సంత మైదానంలో జీడి రైతు పోరుబాట మహాధర్నా జరుగుతుంది అని ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారని వారు తెలిపారు. 80 కేజీలు బస్తాకి 16 వేల రూపాయలు కి కొనుగోలు చేయాలని జీడి రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, జీడి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేరళ వలే జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘంజిల్లా అధ్యక్షులు సంగారు లక్ష్మినారాయణ రైతు సంఘం నాయకులు సింహాచలం, టి.పాపారావు,    బత్తిన.లక్ష్మీనారాయణ, అంబటి.రామకృష్ణ, కే. వినోదు, కవిటి మాజీ సర్పంచ్లు బెందాలం.వెంకటేశ్వరలు,ఆరంగి.మధు పాండవ. శేఖర,బి. జయప్రకాష్ రంగారావు బి.చెంద్రశేఖరు, జుత్తు.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు కళాకారులు కే.హీమసూ దన రావు ,లక్ష్మణరావు జీడి రైతులు గోడుపై పాటలు పాడి కళారూపాలను ప్రదర్శించారు ఇది పలువురుని ఆకర్షించింది.