
ఒక దేశానికి ఒక చట్టం అంటూ ఏకరూపత (యూనిఫార్మిటీ) వుండాల్సిన అవసరం గురించి ప్రధాని, బిజెపి నేతలు అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరోపక్క నాగాలాండ్‌లో మహిళల హక్కులపై బిజెపి కపట ప్రేమ ఒలకబోస్తున్నది.
- నాగాలాండ్ ఉదాహరణ
నాగాలాండ్‌లో 2012 నుండి స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు ఇవ్వడానికి నాగా గ్రూపుల్లో అనేక గ్రూపులు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. మహిళలకు రిజర్వేషన్లు అనేది నాగా సాంప్రదాయ చట్టాలకు వ్యతిరేకమని వారు భావిస్తున్నారు. కానీ, నాగా మహిళా సమాఖ్య నాయకత్వంలో నాగా మహిళలు మూడో వంతు రిజర్వేషన్‌ను బలంగా కోరుతున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా మహిళా సంఘాల మద్దతు కూడా వుంది. ఇదంతా పురుషాధిపత్య భావన తప్ప నాగా సాంప్రదాయ చట్టాల్లో ఇటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏమీ లేదని వారు పేర్కొంటున్నారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అఫిడవిట్‌ను సమర్పించడం లేదంటూ గత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఇది మహిళల హక్కులకు సంబంధించిన అంశమన్నది స్పష్టం. 'ముస్లిం కూతుళ్ళ' గురించి ఎంతగానో ఆందోళన చెందే ప్రధాని 'నాగా కూతుళ్ళ'పై పూర్తిగా మౌనం వహించారు. దీనివల్లే వారికి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కు నిరాకరించబడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనిపై మౌనంగా వుంది? ఈ ఏడాది ఏప్రిల్‌లో, ఎన్నికలు ముగిసిన వెంటనే, బిజెపి భాగస్వామిగా గల కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ హక్కును నిరాకరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది బిజెపి నేతే. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తెమ్‌జెన్ ఇమ్నా తమ ప్రభుత్వ చర్యను సమర్ధించారు. గిరిజన సంస్థలతో చర్చించేందుకు మరింత సమయం అవసరమని అన్నారు. బిజెపికి అనుకూలంగా వుంటే, ద్వంద్వ వ్యవస్థ మంచిది, కానీ ఒక ప్రత్యేక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తే మాత్రం వారు ఒక చట్టం గురించి మాట్లాడతారు!
ఈ నాగాలాండ్ ఉదాహరణ ఏం రుజువు చేస్తోంది? మహిళల హక్కుల కోసం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్న బిజెపి సిద్ధాంతంలోని బూటకాన్ని బయటపెడుతోంది. నాగాలాండ్‌లో, మహిళలపై పురుషుల హక్కుల ఏకరూపతనే బిజెపి ఆమోదించింది. 'నాగా కూతుళ్లు' డిమాండ్ చేస్తున్నప్పటికీ మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ ఇవ్వడానికి నిరాకరించింది. రెండవది, నాగాలాండ్‌లో, సాంప్రదాయ చట్టానికి పితృస్వామ్య భావజాలాన్ని భాష్యంగా చెప్పిన ఛాందసవాదులతో బిజెపి జత కట్టింది. ఇక మూడవది, ఈ విషయంలో మార్పు కావాలంటే, అత్యంత ముఖ్యులైన మహిళలతో కలిసి నాగా కమ్యూనిటీతో చర్చలు జరపడం కీలకమైనదని సూచిస్తోంది.
కుటుంబ చట్టంతో సహా గిరిజన కమ్యూనిటీలకు ప్రత్యేక రక్షణ కల్పించే రాజ్యాంగ నిబంధనలకు ఒకవైపు మద్దతునిస్తూనే, సంస్కరణల ద్వారా కమ్యూనిటీల్లోని మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు హామీ ఇచ్చేలా కమ్యూనిటీల్లో అందరూ కృషి చేయడానికి సిపిఎం మద్దతునిస్తోంది. సాంప్రదాయ చట్టాన్ని రద్దు చేయాలన్నది ఇక్కడ వాదన కాదు, దాన్ని సంస్కరించాలన్నది లక్ష్యం.
- పర్సనల్ చట్టాల్లో సంస్కరణలు
పర్సనల్, సాంప్రదాయ చట్టాల్లో సంస్కరణలు అత్యవసరం. నాగాలాండ్ కేసులో చూసినట్లుగా ఏ సంస్కరణలనైనా వ్యతిరేకించే కమ్యూనిటీల్లోని రాజకీయ పలుకుబడి గల వ్యక్తులకు మద్దతిచ్చేది బిజెపి, దాని ప్రభుత్వాలే. చివరకు, చర్చిలో సంస్కరణలు తీసుకురావడానికి సంబంధించి కూడా కన్జర్వేటివ్ అభిప్రాయాలను కలిగివున్న వారి వైపే బిజెపి నిలబడుతోంది. కేవలం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మాత్రమే బిజెపి, ఆ పార్టీ ప్రభుత్వాలు చాలా దూకుడుగా ఆ కమ్యూనిటీని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి, మతం ప్రమాదంలో పడిందంటూ మతతత్వ ఎజెండాను లేవదీయడానికి, ఎలాంటి మార్పునైనా వ్యతిరేకిస్తూ ప్రజలను సమీకరించడానికి కమ్యూనిటీలోని కన్జర్వేటివ్ శక్తులకు వీలు కల్పిస్తోంది. బిజెపి మెజారిటీవాద రాజకీయ చట్రపరిధి కమ్యూనిటీల్లోని సంస్కరణవాదులను ఆత్మరక్షణ వైపునకు తోయడం వాస్తవం. సంస్కరణలు తీసుకురావాలన్న ముస్లిం మహిళల డిమాండ్లను పరిశీలించడానికి ముస్లిం కమ్యూనిటీల్లోని ఛాందసవాదులు తిరస్కరిస్తున్నారు. పైగా, ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధులుగా తమని తాము ప్రకటించుకునే రాజకీయ శక్తులు ఎన్నడూ ఈ సంస్కరణల అవసరం గురించి మాట్లాడలేదు. పైగా ఇందుకు విరుద్ధంగా అసమానమైన యథాతథ స్థితిని మరింత బలోపేతం చేయడానికి బిజెపి మెజారిటీవాదాన్ని వారు ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి ప్రగతిశీల నిరోధక వైఖరులు లక్షిత ప్రచారంలో బిజెపికి మాత్రమే సాయపడతాయి. అన్ని కమ్యూనిటీలకు చెందిన మహిళలకు సమాన హక్కులు కావాలన్న అత్యవసరమైన, వాస్తవికమైన అంశం నుండి దృష్టి మళ్ళించాలని కోరే భిన్న ధోరణులను వ్యతిరేకించడం అన్నిటికంటే తక్షణ అవసరంగా వుంది. చారిత్రకంగా ఇది అత్యంత వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే అంతిమ విశ్లేషణలో మహిళలను నియంత్రించడంపై, కుటుంబంలో మహిళల పరాధీనతపై ఇది ఆధారపడి వుంది. ఛాందసవాద శక్తులతో ఎలాంటి రాజీ వుండబోదు. కానీ సంస్కరణల క్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు గాను కమ్యూనిటీల్లో యంత్రాంగాలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ ప్రక్రియకు సిపిఎం కట్టుబడి వుంది. ముస్లిం మహిళలతో సహా వివిధ కమ్యూనిటీల్లో పర్సనల్ చట్టాల్లో (పర్సనల్ చట్టాల్లోనివన్నీ పురుషులు రూపొందించిన భాష్యాలే) మహిళా వ్యతిరేక సాంప్రదాయాలు, పద్ధతులకు స్వస్తి పలకాలన్న మహిళల డిమాండ్‌కు మద్దతునిస్తోంది.
- గోవా పౌర స్మృతి ఒక ఉదాహరణ
గోవా పౌర స్మృతి గురించి బిజెపి అదేపనిగా ఊదరగొడుతోంది. ఇటీవల, ఉత్తరాఖండ్‌లో ఒక బహిరంగ సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యుసిసిని రూపొందించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నందుకు అభినందించారు. ''గోవాలో యుసిసి వున్నట్లైతే, దేశంలోని మిగిలిన భాగంలో ఎందుకు వుండకూడదు?'' అని ఆయన ప్రశ్నించారు. కానీ ఆయన ఇటువంటి ప్రకటన చేయడానికి ముందు వాస్తవాలను అధ్యయనం చేయాలి. వాస్తవానికి, అటువంటి కోడ్ ఎందుకు పనిచేయదో చెప్పడానికి గోవా సివిల్ కోడ్ మంచి ఉదాహరణ. కొన్ని రంగాల్లో గోవా ఉమ్మడి పౌర స్మృతిలో ఉమ్మడి చట్టాలు వర్తిస్తాయి. కానీ ఇతర పలు రంగాల్లో మాత్రం వివిధ కమ్యూనిటీల కుటుంబ చట్టాల ప్యాకేజీగా వుంటాయి. ఇవి అసమానంగా వుంటాయి. ఉదాహరణకు, వివాహ రుజువుకు సంబంధించి కేథలిక్కులకు విడిగా నిబంధనలు వుంటాయి. చర్చిలో వివాహం చేసుకున్న వారిని పౌర చట్టంలోని విడాకుల నిబంధనల కింద మినహాయించారు. ముస్లింలు బహు భార్యత్వ వివాహాలను చేసుకోలేరు. నిర్దిష్ట పరిస్థితుల్లో, హిందూ పురుషులను బహు భార్యత్వాన్ని కలిగి వుండేందుకు అనుమతించారు. ''ది జెంటిల్ హిందూ కస్టమ్స్ అండ్ యూసేజెస్ కోడ్''గా పిలవబడే గోవా కోడ్‌లో విడిగా వున్న సెక్షన్ కింద ఇది అనుమతించారు. ఇందులోని నిబంధనలు అత్యంత తిరోగమన ధోరణిలో వుంటాయి. హిందూ మహిళ 25 ఏళ్ళలోగా బిడ్డను కనకపోయినా లేదా 30 ఏళ్ళలోగా కొడుకును కనకపోయినా ఆ భర్త రెండో వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ హిందూ మహిళ వ్యభిచారానికి పాల్పడితే ఆ కారణంతో విడాకులు కోరవచ్చు. కానీ పురుషుడు గనక ఆ పనే చేస్తే విడాకులకు అది కారణం కాదు. అందుకే బిజెపి గోవా కోడ్‌ను ఉటంకిస్తోందా? వారే ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అటువంటపుడు మహిళా వ్యతిరేక నిబంధనలు ఇంకా ఎందుకు చట్టంగా వున్నాయి? కనుక గోవా కోడ్ అనుభవం కూడా అదే చెబుతోంది. కొన్ని సందర్భాల్లో మహిళల హక్కులకు సంబంధించి మూకుమ్మడి చట్టంలో నిర్ణయించిన సమాన ప్రమాణం/కొలబద్ద అత్యంత అధ్వాన్నమైంది కావచ్చు. రెండో అంశమేమంటే ఆ గోవా కోడ్ కూడా ఇతర పౌర చట్టాలను పరిగణనలోకి తీసుకోవలసే వచ్చింది.తమ కమ్యూనిటీల్లో సామాజిక, చట్టపరమైన సంస్కరణల కోసం, అలాగే మహిళల కోసం అన్ని కమ్యూనిటీలకు చెందిన మహిళలు, వారి సంఘాలు సాహసోపేతంగా సాగించిన పోరాటాల ద్వారా సిపిఎం వైఖరి ఏమిటనేది తెలియచేయబడింది. మహిళలకు సంబంధించి సమాన హక్కులు వంటి కీలకమైన అంశాన్ని మతపరమైన అంశంగా మార్చడానికి, ఉమ్మడి పౌర స్మృతి పేరుతో సమాజాన్ని చీల్చడానికి, బిజెపి చేస్తున్న ప్రయత్నాలను సిపిఎం వ్యతిరేకిస్తోంది. సిపిఎంకి సంబంధించినంతవరకు, అన్ని కమ్యూనిటీల్లోని మహిళలకు సమాన హక్కులు అనేది కీలకమైన ప్రశ్న. ఏకరూపత సమానత్వంతో సమానం కాదు. దీనిపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి 21వ లా కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా చేసుకోవాలి. ఈ నివేదికను చర్చించడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారో భారత ప్రజలకు బిజెపి ప్రభుత్వం తెలియచేయాలి.
/వ్యాసకర్త : బృందా కరత్, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు/
(వ్యాసం మొదటి భాగం నిన్నటి సంచికలో ప్రచురితమైంది)