Dec 08,2022 08:19
  • నెలంతా ఎలా బతకాలంటూ ఆవేదన

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : కల్యాణకట్టలో పీస్‌రేట్‌పై పనిచేస్తోన్న క్షరకులకు కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇచ్చిన డబ్బుల రికవరీకి టిటిడి ఇప్పుడు చర్యలు చేపట్టింది. ఎటువంటి ముందస్తూ సమాచారమూ ఇవ్వకుండా నవంబర్‌ వేతనం నుంచి రికవరీ ప్రారంభించింది. వచ్చేదే తక్కువ వేతనం, ఇందులో కట్‌ చేసి ఇస్తుండడంతో క్షురకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ముమ్మరంగా ఉన్న సమయంలో తిరుమలలో దర్శనాలను టిటిడి అప్పట్లో నిలుపుదల చేసింది. దీంతో, కల్యాణకట్టలో పీస్‌రేట్‌పై పనిచేస్తున్న క్షురకులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ దృష్ట్యా అప్పట్లో వారికి నెలకు ఎనిమిది వేల రూపాయల చొప్పున ఎనిమిది నెలల పాటు ఇచ్చింది. ఇప్పుడు ఈ మొత్తాలను రికవరీ చేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్‌కు సంబంధించి డిసెంబర్‌లో ఇచ్చిన వేతనంలో కోత పెట్టింది. దీంతో, కొందరికి రూ.17, మరికొందరికి రూ.69, ఇంకొందరికి రూ.77 వేతనం మాత్రమే అందింది. రూ.105, రూ.250 కూడా అందిన వారూ ఉన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఈ మొత్తంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతపై టిటిడి అధికారులను ప్రశ్నించగా, కరోనా కాలంలో ఇచ్చిన అడ్వాన్స్‌ల కటింగ్‌ అని చెప్పడం గమనార్హం. మరో ఏడు నెలల పాటు ఈ విధంగానే మినహాయించుకోనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. దీనివల్ల టిటిడికి ఏటా రూ.350 కోట్లు ఆదాయం సమకూరుతోంది. కల్యాణకట్టలో గత ఇరవై ఏళ్లుగా 'పీస్‌రేట్‌'పై 850 మంది క్షురకులు పనిచేస్తున్నారు. గుండుకు రూ.11, మూడు కత్తెరలకు రూ.4 చొప్పున టిటిడి వారికి చెల్లించాలి. రోజుకు 20 నుంచి 30 గుండ్లు గీస్తారు. రోజుకు సగటున రూ.300 చొప్పున నెలకు రూ.9 వేలు ఆదాయం వస్తోంది. ఇచ్చే మొత్తం పెంచాలని, బస్సుపాసులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని దీర్ఘకాలికంగా వారు కోరుతున్నారు. బస్సుపాసులు ఇచ్చేది లేదని టిటిడి తేల్చి చెప్పింది. గుండుకు రూ.4 అదనంగా ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. పైగా 'కత్తెర' డబ్బులను ఎగ్గొడుతోందని క్షురకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిటిడి ఏర్పాటు చేసిన 'లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ'లో చేరాలని ఒత్తిడి తెస్తూ విజిలెన్స్‌ను పురమాయించిందని అంటున్నారు. తాము 20 ఏళ్లుగా పనిచేస్తున్నామంటూ, ఏజెన్సీలో చేరితే తమ సీనియారిటీని కోల్పోతామంటూ క్షురకులు వ్యతిరేకిస్తున్నారు. తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా వేతనాల్లో టిటిడి కోత పెడుతోందని, దీన్ని ఆపాలని వారు కోరుతున్నారు.

  • రికవరీ ఆపాలి

క్షరకులకు గతంలో ఇచ్చిన మొత్తాన్ని రికవరీ చేయడం ఆపాలి. వందల కోట్ల రూపాయలను వివిధ సంస్థలకు విరాళంగా టిటిడి ఇస్తోంది. క్షరకుల పట్ల కూడా టిటిడి దాతృత్వం చూపాలి. వేతనం నుంచి కోతలు ఆపాలి. గతంలో ఇచ్చిన మొత్తాన్ని ఉచితంగా ఇచ్చినట్లు భావించి రద్దు చేయాలి. అందరినీ పర్మినెంట్‌ చేసి కనీస వేతనం అమలు చేయాలి.
- కందారపు మురళి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి