Jul 07,2023 08:32

ఓ సాధువు అడవిల్లో ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు. ఆయన వద్దకు గురుకులంలో చదువుకునే నలుగురు విద్యార్థులు వచ్చి 'మునీంద్రా! మేం ఎంత చదివినా విషయం గుర్తుండటంలేదు. గొప్ప చదువు చదవాలనే కోరిక ఉంది. మీ వద్ద అనేక మహిమలు ఉన్నాయని విన్నాం. మా కోరిక తీరుస్తారని మీ వద్దకు వచ్చాము. మా కోరిక తీర్చగలరా?' అని అడిగారు.
సాధువు కొంతసేపు మౌనంగా వుండి, గడ్డాన్ని సవరించుకుని 'అలాగే' అన్నాడు. నలుగురి నుదుటన మంత్రించిన విభూది బొట్టుగా పెట్టి, మూలికలు పొడిని నాలుగు పొట్లాలు కట్టి నలుగురికి ఇచ్చాడు. 'దీన్ని ప్రతి నెల పౌర్ణమి రోజున 'చదువు చాలా సులువు, చదువు చాలా సులువు' అనుకుంటూ పాలలో కలిపి సేవించండి' అని వారిని పంపాడు.
నలుగురు వెళ్ళిపోయారు. ఏడాది గడిచింది. ఆశ్చర్యంగా నలుగురిలోనూ మార్పు వచ్చింది. తమ తమ తరగతిలో చాలా మొద్దులుగా వుండే వీరు తరగతిలో ప్రథములుగా మారారు. ఇదంతా సాధువు ఇచ్చిన మూలికా మహత్యం కారణంగానే కదా? అని ఆయనకు కృతజ్ఞత తెలపటానికి మళ్ళీ సాధు ఆశ్రమానికి వెళ్లారు.
ముని వారిని గుర్తించనే లేదు. వీరే ఆయనకు పరిచయం చేసుకుని మీ మూలికా మహత్యం వల్లనే చదువులో రాణిస్తున్నాం ' అని చెప్పారు.
సాధువు సంతోషించి 'నాయనలరా! నేనిచ్చిన మూలికలో ఏ మహిమా లేదు. నేను ఏ మంత్రం వేయలేదు. నేనిచ్చిన ఆ మూలికల పొడిపై మీకు నమ్మకం కుదిరింది. దాంతో బలంగా మీ మనుసుల్లో నాటుకుని కష్టపడి చదివారు. కృషి చేసారు. మీలో వుండే మీ ఆత్మవిశ్వాసమే మిమ్ముల్ని గెలిపిస్తుంది' అన్నాడు. అది నిజమే అనిపించింది ఆ నలుగురికి. సాధువు వద్ద సెలవు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
 

- డా.దార్ల బుజ్జిబాబు
92905 04570