Nov 21,2023 09:52

చలికాలంలో జుట్టుకు మరింత పోషణ అవసరం. పొడి వాతావరణం, కాలుష్యం కారణంగా ఈ సీజన్‌లో జుట్టు త్వరగా డల్‌గా మారుతుంది. తేమను కోల్పోతుంది. దీంతోపాటు చుండ్రు సమస్య వెంటాడుతుంది. ఇలాంటి స్థితిలో జుట్టు మృదువుగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
తల స్నానం చేసే ముందు తప్పనిసరిగా ఆయిల్‌ మసాజ్‌ లేదా షాంపూ-కండీషనర్‌ ఉపయోగించాలి. ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదుత్వం కోల్పోకుండా ఉంటుంది. కోల్పోయిన తేమను పునరుద్ధరిస్తుంది.
చలికాలంలో జుట్టు ఊడడం లేదా చిట్లడం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సహజసిద్ధంగా తయారుచేసిన హెయిర్‌ జెల్‌ ఉపయోగించాలి.
షాంపూ చేసిన తర్వాత తడి జుట్టు మీద ఈ హెయిర్‌ జెల్‌ రాసుకోవాలి. ఈ జెల్‌ని జుట్టు మూలాలకు అంటే తలకు పట్టించకూడదు. జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఇది జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది.
ఇంట్లో తయారుచేసిన హెయిర్‌ జెల్‌ను 10-15 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. కండీషనర్‌ ఉపయోగించిన తర్వాత షాంపూ చేసినప్పుడల్లా ఈ హెయిర్‌ జెల్‌ని ఉపయోగించవచ్చు.
 

                                                   హెయిర్‌ జెల్‌ ఎలా తయారుచేసుకోవాలంటే..

ఒక స్ప్రే బాటిల్‌లో 4-5 టీస్పూన్ల రోజ్‌ వాటర్‌, 1 టీస్పూన్‌ తాజా అలోవెరా జెల్‌ కలుపుకోవాలి. ఆ తరువాత దీనికి 1 స్పూన్‌ విటమిన్‌ ఇ నూనె లేదా బాదం నూనెను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి 1-2 స్పూన్ల నీళ్లు కలుపుకుంటే హెయిర్‌ జెల్‌ సిద్ధం అయినట్లే.