కోయిల సాగరం అనే అడవిలో ఒక చిలుక నివసించేది. ఒకరోజు ఆహార అన్వేషణకు బయలుదేరిన చిలుక, సాయంత్రానికి ఇంటికి చేరేసరికి ఆ చెట్టు మీద ఒక కాకి ఉండడం గమనించింది. 'ఎవరు నువ్వు? ఈ చెట్టుపైన ఎందుకు వాలావు? నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూడలేదు?' అని కోప్పడుతూ కాకిని అడిగింది.
'మిత్రమా, నన్ను క్షమించు. నేను ఇక్కడికి వచ్చే సమయానికి ఈ చెట్టు పైన నీవు లేవు. నా పేరు వాయసం. నేను పక్కనే ఉన్న అడవిలో ఉండేదానిని .అక్కడ తాగడానికి నీరు దొరకడం లేదు. ఈ అడవిలో నది ప్రవహిస్తోంది అని తెలుసుకున్నాను. ఇక్కడ తాగడానికి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చని చెట్లు ఉన్నాయి. ఉండడానికి యోగ్యంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. మిత్రమా, నన్ను కూడా ఈ చెట్టుపై ఉండనివ్వవా? ఇక నుండి మనిద్దరం కలిసిమెలిసి ఉందాం' అని అన్నది వాయసం.
'మాటలు బాగానే నేర్చినట్టు ఉన్నావు. కానీ నీతో ఈ చెట్టుపై కలిసి ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వచ్చిన దారినే వెళ్ళు' అని కోపంగా కాకిని వెళ్లగొట్టింది చిలుక.
బాధపడుతూ అక్కడి నుంచి దూరంగా బయలుదేరింది కాకి. నది పక్కన ఉన్న మరొక చెట్టుపై వాలింది. చిలుకతో స్నేహం చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ, నన్ను ఆదరించలేదు. ఎప్పటికైనా చిలుక మారితే బాగుండు' అనుకుంటూ ఆ చెట్టుపైనే గూడును కట్టుకొని నివసించ సాగింది కాకి.
కొన్ని రోజుల తరువాత చిలుక అడవిలో ఉన్న పళ్ళను తింటూ దాహం వేసి నది దగ్గరికి వెళ్ళింది. నదిలో నీరు తాగుతుండగా ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చి నదిలో పడిపోయింది. టపటప రెక్కలు కొట్టుకుంటూ నీటిలో మునిగిపోతున్న చిలుకను పక్కనే ఉన్న చెట్టుపై నివసిస్తున్న కాకి గమనించి రివ్వున ఎగురుకుంటూ వచ్చింది. 'భయపడకు మిత్రమా! నేను నిన్ను కాపాడుతాను. ధైర్యంగా ఉండు' అని అన్నది. తన కాళ్లతో చిలుకను గట్టిగా పట్టుకొని చెట్టు పైకి ఎగిరింది. చలికి గజగజ వణికిపోయింది చిలుక. చిలుకను తన గూటిలో ఉంచి వెచ్చదనాన్ని అందించింది. కొన్ని పళ్ళను తీసుకొచ్చి ఇచ్చింది. ఆశ్రయం ఇవ్వకపోయినా తన మీద కాకి చూపిస్తున్న ప్రేమకు చిలుక సిగ్గుపడింది. 'మిత్రమా! నన్ను క్షమించు. నీ మనసు తెలియక నిన్ను చెట్టుపై నుంచి వెళ్లగొట్టాను. నిన్ను దూరం పెట్టినా నీవు అవన్నీ మనసులో పెట్టకోకుండా ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. ఇక నుంచి మనిద్దరం కలిసే ఉందాము. మళ్లీ మన చెట్టు మీదికి వెళ్దాంరా' అని బతిమిలాడింది చిలుక. కాకి ఎంతో సంతోషించి చిలుకతో కలిసి రివ్వున ఎగిరింది.
- డేరంగుల స్రవంతి,
10 వ తరగతి.