ఒక తాబేలు ఆయాసంతో నడుస్తోంది. దారిలో దానికి నక్క కనిపించింది.
'ఏంటి మిత్రమా! ఎక్కడికి వెళుతున్నావు ?' అని అడిగింది నక్క.
'నా పిల్లల్ని చూసుకోవడానికి వెళుతున్నాను' అంది తాబేలు. 'నీకు పిల్లలు ఎక్కడున్నారూ? మతిమరపుకానీ రాలేదు కదా?!' ఆశ్చర్యపోయింది నక్క.
'నిజమే! నాకు ఇంతవరకూ పిల్లలు లేరు. కానీ చెరువుగట్టు మీద ఇసుక లోపల నేను గుడ్లు పెట్టాను. దాదాపు రెండు నెలల పది రోజులు అయ్యింది. అవి ఇప్పుడు పిల్లలు అవుతాయి' అంది తాబేలు.
'అవునా! కానీ నేనెప్పుడూ చెరువు ఒడ్డున గుడ్లు చూడనేలేదే..! అయినా ఇప్పటివరకూ ఉంటాయా?' అని ఆశ్చర్యపోయింది నక్క.
ఆ మాటకు తాబేలు 'నేను గుడ్లు పెట్టి, వాటిపై ఇసుక కప్పాను' అని చెప్పింది.
'అలాగా! అయితే నేనూ వస్తాను. నీ పిల్లల్ని చూస్తాను!' అంది నక్క.
తాబేలు, నక్క అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ.. పోతూ ఉండగా దార్లో వాటికి కోతి కనిపించింది. 'నక్కబావా! మీరిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు?' అని అడిగింది కోతి. విషయం చెప్పింది తాబేలు.
'ఎప్పుడో గుడ్లు పెట్టావు. ఇప్పటి దాకా పొదిగాయో లేదో చూడలేదు.. అసలు పట్టించుకోలేదు.. అవి ఎప్పుడో కుళ్ళిపోయుంటాయి. నీకు ఇంత మతిమరపు అయితే ఎలా?' అంటూ వాటి వెంట చూడటానికి వెళ్ళింది కోతి. ఆ మూడూ నడుచుకుంటూ చెరువు వైపు పోసాగాయి. కొద్ది దూరం పోయేసరికి వాటికి కుందేలు కనిపించింది.
'ఎక్కడికి వెళుతున్నారు?' అని అడిగింది కుందేలు. విషయం చెప్పింది తాబేలు. 'నీకున్నంత బద్ధకం, మతిమరపు ఎవరికీ ఉండదు. ఇన్నిరోజులు గుడ్లని మరిచిపోయి ఎలా ఉన్నావు. పైగా ఈ రోజే గుడ్ల నుంచి పిల్లలు పుడతాయని జోశ్యం చెపుతున్నావు. నీ మతిమరపుకు గుడ్లు ఎప్పుడో మురిగిపోయి ఉంటాయి' అంది కుందేలు.
అవి నాలుగూ నడుచుకుంటూ చెరువుకు చేరాయి. 'నువ్వు గుడ్లు ఎక్కడ పెట్టావో అదైనా గుర్తుందా?' ఎగతాళిగా అంది నక్క.
'అదిగో ! ఆ ఉత్తరం వైపు ఉన్న బండరాయి పక్కనే ఇసుకలో గుడ్లు పెట్టాను' అంది తాబేలు. అవి నాలుగు వేగంగా బండరాయి వద్దకు చేరాయి. తన పదునైన గోర్లతో ఇసుకను తవ్వింది తాబేలు. అప్పుడే గుడ్ల నుంచి విచ్చుకున్న బుజ్జి బుజ్జి తాబేలు పిల్లలు ఇసుకలో నుంచి బయటికి వచ్చాయి. బుజ్జి తాబేళ్లని చూసి ముచ్చటపడింది తల్లి తాబేలు. వాటిని ముద్దాడింది. అవి తల్లిని చూసి ఆనందపడ్డాయి. ఇదంతా గమనిస్తున్న నక్క, కోతి, కుందేలు ఆశ్చర్యపోయాయి.
తాబేలును అనవసరంగా ఏదేదో అన్నామని పశ్చాత్తాపం చెందాయి. తాబేలుకు మతిమరుపు లేదని, గుడ్లు ఎక్కడ పెట్టిందో కచ్చితంగా గుర్తుంచుకుందని.. పైగా అవి పొదిగే కచ్చితమైన సమయం తాబేలుకు తెలుసుననీ.. మనకే తన గురించి తెలియదని సిగ్గుపడ్డాయి.
అప్పుడు తాబేలు 'గుడ్లు మేము పొదగము. పొదిగేందుకు కావలసిన వెచ్చదనం, రక్షణ కోసం వాటిని ఇసుక లోపల దాచిపెడతాం. ఇక అవి పక్వదశకు రావడం మాకు మానసికంగా తెలుస్తుంది. అప్పుడే అవి పిల్లలై, బయటికి వస్తాయి' అంది తాబేలు. శాస్త్రానికి అందని విషయమేదో తెలుసుకున్నామన్న భావన కలిగింది నక్క, కోతి, కుందేలుకు.
వెంటనే 'మిత్రమా! నువ్వు సష్టిలో ఓ ప్రత్యేక జీవివి. నీకు మతిమరపు లేదు. మంచి అవగాహనతోనే ఉన్నావు. నీ గురించి మేమే పొరపాటు పడ్డాం. ఏమీ అనుకోకు' అన్నాయి.
'ఫర్వాలేదు. తెలియకే కదా మీరన్నది. సరే.. ఉంటాను' అని వాటి దగ్గర సెలవు తీసుకుని తాబేలు తన బుజ్జి పిల్లలతో చెరువులోకి వెళ్ళిపోయింది.
పైడిమర్రి రామకృష్ణ,
9247564699