Aug 22,2023 15:59

మాస్కో  :   రష్యా ప్రయోగించిన లునా -25 కూలిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రముఖ రష్యన్‌ శాస్త్రవేత్త ఆస్పత్రి పాలయ్యారు. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడి పైకి రష్యా 'లునా - 25' అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం విఫలం కావడంతో మైఖేల్‌ మారోవ్‌ (90) ఆస్పత్రిపాలైనట్లు స్థానిక పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆయన మాస్కోలోని క్రెమ్లిన్‌కు సమీపంలో ఉన్న సెంట్రల్‌ క్లినికల్‌ హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన వార్తాచానెల్‌ ఆర్‌బిసి మరియు మోస్కోవ్స్కీ కొమ్సోమోలెట్స్‌ వార్తాపత్రికతో మాట్లాడారు. 'లునా-25 వైఫల్యం పెద్ద ఎదురుదెబ్బ, ఇది నా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించింది' అని  అన్నారు.

'ఇది నా జీవితానికి సంబంధించిన అంశం.. చాలా క్లిష్టమైన సమయం. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. రష్యా లూనార్‌ ప్రోగ్రామ్‌ పునరుద్ధరణపై నా చివరి ఆశలు ఆవిరైపోయాయి. లునా-25 వైఫల్యం వెనుక ఉన్న కారణాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించాలని నేను ఆశిస్తున్నాను' అని మైఖేల్‌ అన్నారు. మైఖేల్‌ మారోవ్‌ గతంలో అనేక అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు.

'మిషన్‌ను ల్యాండ్‌ చేయడం సాధ్యంకాకపోవడం బాధాకరం. బహుశా.. మా చంద్రుని మిషన్‌ పునరుద్ధరణను చూడాలనేది చివరి ఆశ' అని మారోవ్‌ పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలో ఆ మాడ్యూల్‌లోని ఇంజిన్లు ఆఫ్‌ కాకపోవడంతో చంద్రుని ఢీ   కొట్టి లునా -25 చంద్రుడిపై కుప్పకూలిపోయినట్లు రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.