కవ్వించే కాలరేఖపై
మనిషి పరిగెడుతున్నాడు
జీవితం లోతైన ప్రాముఖ్యతను తవ్వి చూడ్డానికి
తీరిక గుణపంలేదు
ఒకరికొకరు చేతులు కూర్చుకుని
చుట్టూ తిరుగుతూ చేసే చోబీ నృత్యంలాంటి
చిన్న సరదాలు పుంజుకునే రోజుల్లేవు
ముందు దున్నిన వంకర చాళ్ళను సరిదిద్దే మడకలేదు
బతుకులో పనసపండు వాసన లేదు
మనిషి గురించి చెప్పేవాళ్ళు లేరు
విలుకాండ్రున్నారు విల్లంబులున్నాయి
నేను పోరాడానని చెప్పే గాయపు గుర్తుల్లేవు
ఒక తూగు చప్పున మేల్కోవడం లేదు
విచ్ఛిన్న మవుతున్న కలలేవో యోచన లేదు
వర్ణించలేని ద్ణుఖం ఉంది
నేరం కుర్చీ నీడలో తప్పించుకునే దృశ్యాలున్నాయి
గుంజకు కట్టిన గుండె ఉంది
మధ్యమధ్యలో పుట్టే తాత్కాలిక ప్రేమలున్నాయి
కొంతసేపు తగిలించుకుని తీసివేసే
మంచితనం మాస్కులున్నాయి
ఒక కోరికకు ఒక గతానికి మధ్య చిక్కుకుని
జీవితంలోని అన్ని దశల నుంచి పారిపోవడముంది
తమ చీకటి గుహలో
సంపూర్ణ సౌకర్యవంతంగా ఉండడముంది
వనాల ప్రతినిధిగా ఓ ముళ్ళచెట్టుంది
ఏది వెనుకుందో అదలాగే ఉంది
ఈ వెలుగు సరిపోదు
ఈ చేతులు సరిపోవు
ఈ చికిత్స సరిపోదు
లోతైన విషాదం ఏదో రోజుల్ని దాటుతోంది
ఇన్ని ప్రణాళికల దారి చివరిలో
గులకరాళ్ళ చప్పుడు ఆగలేదు
ఇది ప్రతిరోజూ రెక్కలు కత్తిరించే వాస్తవం
అలను అల నెట్టినట్టు
నొప్పిని నొప్పి నెడుతోంది
ఎక్కడా అద్దం దొరక్క
నిజం తనముఖాన్ని తాను చూసుకోలేదు
ఆ అద్దాన్ని చూపగలిగిన
అందర్నీ కనిపెట్టుకునే,కన్నీళ్ళు పెట్టుకునే
నిగూఢమైన నిజాయితీగల మనిషెక్కడీ
- శాంతయోగి యోగానంద
91107 70545










