- ప్రదర్శకులపై పోలీసుల దాష్టికాలు, ముగ్గురు మృతి
నైరోబి : కెన్యాలో జరుగుతున్న నిరసనల్లో మరణించిన వారి సంఖ్య శనివారానికి మూడుకి చేరుకుందని ఆస్పత్రి, పోలీసు అధికారులు తెలిపారు. పన్నుల పెంపును నిరసిస్తూ వీధుల్లోకి రావాల్సిందిగా ప్రతిపక్ష నేత రైలా ఒడింగా ప్రజలకు పిలుపిచ్చారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఒడింగా కాన్వారును ఉద్దేశించి రాజధాని నైరోబిలో పోలీసులు శుక్రవారం బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మొంబసా, కిసుము నగరాల్లో కూడా ప్రదర్శకులపై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. కిసుములో ఇద్దరు మరణించగా, మిగోరిలో మరొకరు మరణించారని పోలీసులు తెలిపారు. నిరసనలు తెలియచేస్తున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి విలీ ముతుంగాతో సహా పౌర ప్రముఖులపై శనివారం పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. పన్ను పెంపును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అమాయకులైన ప్రజలను విడుదల చేయాల్సిందిగా కోరుతూ శాంతియుతంగా అడిగేందుకు ఇక్కడకు వచ్చిన తమపై ఇలా పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించడం సమర్ధనీయం కాదని న్యాయవాది లెంపా సుయింకా వ్యాఖ్యానించారు. పోలీసుల చర్యలో కొంతమంది గాయపడ్డారని, వారిని వెంటనే ఆస్పత్రులకు తీసుకెళ్ళాల్సి వచ్చిందని ఆయన విలేకర్లకు చెప్పారు. పోలీసుల దాష్టికాలపై వెంటనే కూలంకషంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం వుందని శనివారం కెన్యాజాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఇలా ఏకపక్షంగా అరెస్టులు చేయడాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు మానవ హక్కుల గ్రూపులు ఖండించాయి.