Jul 19,2023 08:08
  •  23 మంది మృతి
  •  చట్టాన్ని స్వాగతించిన అమెరికా, ఐఎంఎఫ్‌

నైరోబి : కెన్యా ఫైనాన్స్‌ యాక్ట్‌ -2023లో తీసుకువచ్చిన కొత్త పన్ను చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు భారీఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలు, ఆందోళనలపై పోలీసులు అణచివేతకు దిగడంతో ఇప్పటివరకు 23మంది మరణించినట్లు తెలుస్తోంది. జీవన వ్యయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే అమెరికా, ఐఎంఎఫ్‌ మాత్రం స్వాగతించాయి. కెన్యాలో అమెరికన్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ చట్టం భద్రత కల్పిస్తుందని వ్యాఖ్యానించాయి. దేశంలో చోటు చేసుకుంటున్న హింస, అల్లర్లు, అనవసరపు బల ప్రయోగాల పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం (ఒహెచ్‌సిహెచ్‌ఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు అణచివేత చర్యలకు దిగుతున్నా నిరసనలు ఏ మాత్రమూ ఆగడం లేదు. ఈ చట్టంలో తీసుకువచ్చిన పన్నులతో తమ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోందని ఆందోళనకారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంధన ఉత్పత్తులపై వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌)ను రెట్టింపు చేయడం అన్నింటికంటే అజ్రాస్వామిక చర్య అని వారు విమర్శిస్తున్నారు. ప్రజల ఆందోళనలు ఏ మాత్రమూ పట్టించుకోని రీతిలో అమెరికా ఈ చర్య పట్ల హర్షం వ్యక్తం చేసింది. చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు కెన్యాలో అమెరికా రాయబారి మెగ్‌ వైట్‌మన్‌ ప్రకటించారు. హైకోర్టు ఈ చట్టం అమలును జూన్‌ 30న తాత్కాలికంగా ఆపింది, ఆ తర్వాత జులై 10న నిరవధికంగా నిలుపుచేసింది.