Jul 25,2023 21:17
  •  ఆకృత్యాలను నిరసిస్తూ నిరసనలు
  •  మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌

ప్రజాశక్తి - యంత్రాంగం : మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింస, ఆకృత్యాలను ఖండిస్తూ ఐద్వా, ప్రజా, గిరిజన, దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని మోడీ, అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని పలువురు కోరారు.
అనంతపురంలోని బిసి బాలికల వసతిగృహంలో ఐద్వా ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానవ సమాజం సిగ్గుపడేలా మణిపూర్‌లో దారుణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, హింస పెరిగిపోతోందని, దీనిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, విద్యార్థినులు పాల్గొన్నారు. నగరంలోని లలిత కళాపరిషత్‌ నుంచి టవర్‌ క్లాక్‌ వరకు ర్యాలీ చేపట్టి, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
డాక్టర్‌ బిఆర్‌.కోనసీమ జిల్లా అమలాపురంలో గడియార స్తంభం సెంటర్‌లో, రాజోలు, కాట్రేనికోన, ముమ్మిడివరం తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. కాకినాడలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కృతికాశుక్లాకు వినతిపత్రం అందించారు. అమలాపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. ఏలూరులోని ఎపి బేవరేజ్‌ కార్పొరేషన్‌ గొడౌన్‌ ఎదురుగా రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో మావుళ్లమ్మ గుడి సెంటర్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజుకు వినతిపత్రం అందజేశారు.
కర్నూలు జిల్లా పరిషత్‌ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంట బస్టాండ్‌లో ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. కడప, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా మునగపాక మెయిన్‌ రోడ్డులో నిరసన తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నంలో అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఆందోళనలు చేపట్టారు. తిరుపతి సుందరయ్యనగర్‌లో ధర్నా జరిగింది. చిత్తూరులో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో నిర్వహించిన నిరసనలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాధీశ్వర్‌రావు పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన ద్వారం నుండి జాషువా విగ్రహం వరకు ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకూ ప్రదర్శన సాగింది.

  • శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ కారు అడ్డగింత

మాణిపూర్‌లో జరుగుతున్న దారుణ మారణకాండ, మహిళలపై అకృత్యాలను ఆపాలని డిమాండ్‌ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు కారును సిపిఎం నాయకులు దిగ్బంధించారు. శ్రీ సత్యసాయి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌ తదితరులు కలెక్టర్‌ కారును అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా తయారవుతున్న ఈ హింసను ఆపేలా కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేలా కలెక్టర్‌ రాతపూర్వకంగా లేఖ రాయాలని కోరారు.