Jul 26,2023 21:42
  • మణిపూర్‌లో అకృత్యాలను నిరసిస్తూ నిరసనలు
  • మోడీ మౌనం వీడి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అమానుష అత్యాచారాలను ఖండిస్తూ ఐద్వా, గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. మోడీ మౌనం వీడాలి, దోషులను కఠినంగా శిక్షించాలి, మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో సాహితీ స్రవంతి, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తాళ్లరేవులో యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాజులూరులో ఎపి కౌలు రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మండపేటలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎల్‌ఐసి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. చాగల్లులో హమాలీ కార్మికులు, నిడదవోలులో అంగన్‌వాడీ కార్మికులు నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. భీమవరంలోని అంబేద్కర్‌ సెంటర్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఆధ్వర్యాన ధర్నా చేశారు. పోడూరు మండలం గుమ్మలూరులో అంగన్‌వాడీలు ర్యాలీ చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏలూరులో మార్కెట్‌ యార్డ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌, నిమ్మకాయల మోత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. విశాఖ జిల్లా గాజువాక కోర్టు కాంప్లెక్స్‌ వద్ద ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌, గాజువాక బార్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యాన న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. మణిపూర్‌ హింసాకాండపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో వేమన విజ్ఞాన కేంద్రం, సాహితీ సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన, వెంకటగిరిలో రైతుకూలి సంఘం, స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యాన నిరసన ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ముంగమూరు గ్రామంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా క్రోసూరులోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు.
సిపిఎం ఆధ్వర్యాన నిరసన దీక్ష
మణిపూర్‌ మారణకాండకు నిరసనగా విజయనగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.. మణిపూర్‌లో గత మూడు నెలలుగా మారణకాండ జరుగుతున్నా శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రధాని మోడీ మౌనం వహించడం దుర్మార్గమన్నారు. వెంటనే మణిపూర్‌లో ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

23