పచ్చిబద్దల్లా పగిలిన పాదాలు
నల్లటి నలుపు
మరింకేం పోలిక అక్కర్లేదు
త్రీడీలో చూసినట్టు ఉబ్బిన ముఖాలు
భుజాల మీద వేళ్లాడుతూ
చర్మాన్ని చుట్టుకున్న శబ్దాల చందమామలు
ఆ రసధ్వని వెనక ఉనికి మహాసముద్రం
సలవాద్రి గొంతులో పలికిన
దు:ఖపు వెలివేతల జీర కలిసిపోయిన
నిష్కల్మష సంగీతం ఎందుకు నన్ను ముంచెత్తుతుంది!
ఆగిపోయిన ఊపిరిని
మళ్ళీ మళ్ళీ పోసి ఆశలు పూయిస్తుంది
అది మోహమూ కాదు; మాయా కాదు
నా పితరుల ముందు నిల్చోబెట్టేందుకు
నన్ను గతానికి మోసుకెళ్లే కలల పడవ
బిర్ర బిగుసుకున్న చర్మపు పలక మీద
చీకటిలో మునిగిన చేతులు
చిర్రా చిటికెనపుల్ల తగిలించగానే
సూర్య కిరణాలన్నీ నిప్పురవ్వలై చిందిపడినట్టు
మెరుపొచ్చి కరచాలనం చేసినట్టు
ఊహించని తత్తరపాటు
ఒళ్ళు ఒళ్ళంతా నిట్ట నిలువునా నిలబడి
నాగుబామై ఆడుతుంది!
ఆ హౌరు చెవులకి తాకుతుంటే
భౌతికాభౌతికాల మజ్జన వేలాడుతూ
ఆకాశపు అంచుమీద నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తావు
ముఖంలో రంగులు మారిపోతూ మారిపోతూ
నీలోకి నీ తాతో ముత్తాతో వచ్చి ఆవహిస్తారు
మాటల్లేని తనంలో
మట్టి మీద పొర్లాడుతూ మహదానందం పొందుతావు
ఇది సంప్రదాయానికి ఆవల జరిగే ఉత్సవం
నొసలు చిట్లించే ముఖాలకి అర్థంకాని ఆనంద పరమావధి
మన్నుని మనసారా కౌగలించుకునే మహద్భాగ్యం!
చావైనా , సంబరమైనా
మోత సాగే కొద్దీ
గుండెల్లో ఎక్కడో నరాల్ని చీల్చుకుని
గొంతుముడిలో చిక్కుబడ్డ పాటల
ముందటి సాకీ గుర్తుకుతెస్తుంది
ఎక్కడ ఆ చప్పుడు విన్నా
విలాప వాక్యాలన్నీ
వీపు మీదనే పలికించుకున్న
ప్రవక్తల రోదనలా వినబడుతున్నా
మళ్ళీ మళ్ళీ హత్తుకోవాలనిపిస్తుంది
నన్ను నేను దొరకబుచ్చుకుని
చిందు తొక్కాలనిపిస్తుంది !
- అనిల్ డ్యాని
97033 36688










