- వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ
- లాఠీచార్జీ, గాలిలోకి కాల్పులు
- 144 సెక్షన్ విధింపు
ప్రజాశక్తి - వినుకొండ (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణులు ఎదురెదురుగా ఘర్షణకు దిగడం, పరిస్థితిని చక్కబెట్టేందుకు లాఠీఛార్జీ, ఆపై గాలిలోకి కాల్పులతో వినుకొండ పట్టణం అట్టుడికింది. టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులుతోపాటు మరికొందరిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి శ్రేణులు గురువారం వినుకొండ పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో కలిసి ఆర్‌సిఎం చర్చి సమీపంలోకి రాగానే టిడిపి శ్రేణులు ఎదురుపడ్డాయి. ఎమ్మెల్యే తన కారులో నుండే టిడిపి శ్రేణులను దుర్భాషలాడడంతో వారు ఎమ్మెల్యే కారును చుట్టుముట్టారు. దీంతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం, ఆక్కడికి వైసిపి శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. టిడిపి శ్రేణులపైకి వైసిపి శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీంతో టిడిపి కార్యకర్తలు ప్రతిదాడి చేశారు.

పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేసి ఇరు పక్షాలను చెదరగొట్టినా వైసిపి శ్రేణులు ఏ మాత్రం వెనక్కు తగ్గకపోవడంతో వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు గాలిలోకి కాల్పులు జరిపారు. టిడిపి శ్రేణులంతా ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణంలోకి పరుగులు తీయగా వైసిపి కార్యకర్తలు మరోసారి దాడి చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పట్టణ సిఐతోపాటు రూరల్ సిఐ ప్రసాద్, ఐదు మండలాల ఎస్‌లు, సిబ్బంది రంగంలోకి దిగారు. పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు. ఘర్షణలో టిడిపికి చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే పథకం ప్రకారమే మారణాయుధాలతో దాడి చేయించారని, దాడి చేసిన వారితోపాటు ఎమ్మెల్యేపైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1-6 తేదీల్లో లోకేష్ యువగళం పాదయాత్ర ఈ ప్రాంతంలో జరగనుండగా దాన్ని అడ్డుకోవడానికే ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.










