
ప్రజాశక్తి-వేమూరు : సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్న దృష్ట్యా బుధవారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆలపాటి రాజేంద్రప్రసాదుల ఆధ్వర్యంలో తెనాలిలోని ఇరిగేషన్ కార్యాలయం ముట్టడించారు. కృష్ణా పశ్చిమ బ్యాంక్ కెనాల్ ద్వారా విడుదలయ్యే నీరు తనాలి బాపట్ల రేపల్లె డివిజనల్ పరిధిలో లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని ప్రభుత్వ నిర్లక్ష్యం ముందు చూపు లేకపోవటం వలన నేడు రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. గత మూడేళ్లుగా పట్టిసీమను మూత వేసేనా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పులిచింతల్లో ఉన్న 40 టి ఎం సి ల నీటిని కూడా పూర్తిగా వినియోగించి నేడు రైతులకు నీరు అందకుండా చేతులెత్తే పరిస్థితికి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడిగిన ప్రశ్నలకు అధికారులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు గడపగడపకు తిరగటం కాదు పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలిస్తే రైతుల బాధ కనిపిస్తుందని, ప్రతిపక్షాలను విమర్శించడం బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యేలు,మంత్రులకు రైతుల కష్టాలు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు.