ప్రజాశక్తి - రేపల్లె : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసుతో అక్రమ అరెస్టు చేశారంటూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ‘బాబుతో నేను’ పేరుతో రిలే నిరాహార దీక్ష 4వరోజు నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ చర్యలను తూర్పారబట్టారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, రెండున్నర లక్షల మందికి శిక్షణ ఇచ్చి, 80వేల మంది యువత మెరుగైన ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకుండా చేసి చంద్రబాబుపై కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గం అని ఎలుగెత్తారు. అవినీతి జరిగిందంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలనే గతంలో విశాఖ వేధికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో తమ ఆస్తిగా చూపించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అంతకు ముందు స్కిల్ డెవలప్మెంట్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, అది తమ ఘనతే అన్నట్లు భారీ ప్రకటనలు గుప్పించుకున్నారని వెల్లడించారు. అప్పుడు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ లాంటి అవినీతిపరుడు దేశంలో ఎక్కడా లేరని, చంద్రబాబుపై నిరాధారణ ఆరోపణ చేయటం సరికాదని అన్నారు. కార్యక్రమంలో అనగాని శివప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధరరావు, జీవి నాగేశ్వరరావు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, టీడీపీ లీగల్ సెల్ నాయకులు ధర్మతేజ, తదితరులు పాల్గొన్నారు.










