Feb 08,2021 19:52

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో (చెన్నై) : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడిఎంకె బహిష్కృత నేత శశికళ సోమవారం తమిళనాడులో అడుగుపెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలక అన్నాడిఎంకె (ఎఐఎడిఎంకె) పార్టీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, తాను ప్రయాణిస్తున్న కారుపై ఆ పార్టీ జెండాను పెట్టుకుని తన వైఖరేంటో రాజకీయ వర్గాలకు తెలియజేశారు. అలాగే ఆకుపచ్చ చీరలో దర్శనమిచ్చిన ఆమె, తన మద్దతుదారులను కారులో నుంచే పలకరించారు. ఎఐఎడిఎంకె పార్టీ జెండా తమకు చెందినదని, ఈ విషయమై తాము చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని అన్నాడిఎంకె మంత్రి సివి షణ్ముగం మీడియాకు వెల్లడించారు.

vk sasikala


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్లు శిక్షను అనుభవించిన శశికళ గతనెల 27న జైలు నుంచి విడుదలై ఓ హోటల్లో ఉన్నారు. సోమవారం తమిళనాడులో సరిహద్దు ప్రాంతమైన అత్తిపల్లిలో అడుగు పెట్టారు. ఆమెపై ఆరేళ్లు నిషేధం ఉన్న కారణంగా, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. చెన్నైలో ఆమెకు భారీ ఎత్తున స్వాగతం పలకాలని మద్దతుదారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎఐఎడిఎంకె శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళేనంటూ పోస్టర్లు వెలిశాయి. కోవిడ్‌ నిబంధనల కారణంగా భారీగా జనాలు గుమిగూడే సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు ఆదేశించారు. శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలో పడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు.