Aug 02,2021 00:00

చెన్నై : తమిళనాడులో అధికార పార్టీ ఎఐఎడిఎంకె, మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీ ఎఎంఎంకె మధ్య యుద్ధం మొదలైంది. ఎఐఎడిఎంకెలో పైచేయి సాధించేందుకు శశికళ, దినకరన్‌ ప్రయత్నిస్తుండగా, వారు పార్టీలోకి రాకుండా చేసేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేతలు, రాష్ట్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా డిజిపికి వారు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోసారి ముందుకొచ్చింది. వికె శశికళ, టిటివి దినకరన్‌ సోమవారం చెన్నైలో పర్యటించేందుకు అనుమతి లభించింది. వారిద్దరి పర్యటనలో విధ్వంసం సృష్టించే అవకాశముందని, వారు సోమవారం చెన్నైకు రాకుండా చర్యలు తీసుకోవాలని తమిళనాడు డిజిపి జెకె త్రిపాఠీకి ఎఐఎడిఎంకె నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రయాణంలో శశికళ ఎఐఎడిఎంకె జెండాను ఉపయోగిస్తారని దినకరన్‌ చెప్పిన విషయాన్నినా ఫిర్యాదులో పేర్కొన్నారు. శశికళ నగరానికి వస్తే అభ్యంతరం లేదని అన్నారు. 'డిజిపికి చెప్పినా.. మమ్మల్మి ఎవరూ అడ్డుకోలేరు. శశికళ మద్దతుదారులు వందమంది మానవ బాంబులుగా మారి నగరానికి చేరుకుంటారని' దినకరన్‌ అన్నారని, శాంతిభద్రతలకు భగం కలిగించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఎఐఎడిఎంకె నేతలు ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా శశికళ ఎఐఎడిఎంకె నేతగా వ్యవహరిస్తున్నారని, ఆమె పార్టీ జెండా ఉపయోగించకుండా చూడాలని డిజిపికి నేతలు విజ్ఞప్తి చేశారు.