Sep 18,2023 17:31

చెన్నై: ప్రస్తుతానికి బిజెపి తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని అన్నాడిఎంకె పార్టీ సీనియర్ నాయకుడు డి జయకుమార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలోనే అన్నీ నిర్ణయిస్తామని, ఇదే పార్టీ స్టాండ్‌ అని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై ద్రావిడ అగ్రనాయకుడు సిఎన్ అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలపై జయకుమార్ ఘాటుగా స్పందించారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. అన్నామలై  అన్నాడిఎంకె, సింహాలపై అరుస్తున్న చిన్న నక్క అని ఎద్దేవా చేశారు.
 “ఆయనకు దమ్ము ఉంటే ఒంటరిగా పోటీ చేయనివ్వండి, నోటా కంటే ఎక్కువ ఓట్లు రావు. పెరియార్, ఎంజీఆర్, అమ్మ లేదా మా నాయకుడు (ఎడప్పాడి కె పళనిస్వామి) వంటి నాయకుల గురించి మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉంది? ఇటువంటి కామెంట్స్ ఆపేయాలని ఎన్నిసార్లు హెచ్చరించినా, ఆయన వినలేదు, ఇకపై మా క్యాడర్ మౌనంగా ఉండదని'' జయకుమార్ హెచ్చరించారు. 
అన్నామలై తమ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాటను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నాడీఎంకే నేత తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాల గురించి చెడుగా మాట్లాడవద్దని అన్నామలైకి సూచించాలని ఢిల్లీలోని ఎన్డీయే నేతలకు విన్నవించినా ఆయన మారలేదని పేర్కొన్నారు.