Nov 18,2023 16:58

చెన్నై: తమిళనాడు స్టాలిన్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య గత కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లుల్ని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో వుంచారు. ఈ బిల్లులపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం తమిళనాడు అసెంబ్లీ గవర్నర్‌ ఏ కారణాలు చూపకుండా.. పెండింగ్‌లో ఉంచిన పది బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది.
తాజాగా ఆమోదం పొందిన బిల్లులో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో వర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్‌ అధికారాలను తొలగించేలా తీసుకొచ్చిన తీర్మానం కూడా ఉంది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. వర్సిటీల వైస్‌ఛాన్సలర్‌లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది.
కాగా, ఈ బిల్లుల ఆమోదంపై ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సిఎం స్టాలిన్‌ మాట్లాడుతూ.. 'అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎలాంటి కారణం లేకుండా గవర్నర్‌ నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదు. కేవలం గవర్నర్‌ తన వ్యక్తిగత కారణాలతోనే బిల్లులకు ఆమోదం తెలపకుండా వెనక్కి పంపారు. ఇలా చేయడం అప్రజాస్వామికం. ప్రజా వ్యతిరేకం.' అని ఆయన అన్నారు.