చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని మైలాడుతురై జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు మంగళవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాల్లో నవంబర్ 13, 14 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం ఎక్స్ పోస్టులో పేర్కొంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలని ఐఎండి సూచించింది. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌కు ఆరెంజ్ అలెర్ట్‌ను ఐఎండి జారీ చేసింది.
కాగా, మంగళవారం (నవంబర్ 14) తమిళనాడులో తమిళనాడులోని తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్, తిరువళ్లూరు, చెన్పై, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబలూరు, అరియలూరు, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం మైలాడుతురై జిల్లాల్లోని విద్యాసంస్థలకు స్టాలిన్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నవంబర్ ప్రారంభం నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతవారం కూడా విస్తారంగా వర్షాలు కురవడం వల్ల స్కూల్స్ మూతబడ్డాయి.