చెన్నై: తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ఇటీవల మరణించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని బుధవారం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. అలాగే తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ ప్రోపగేషన్, జెనిటిక్స్ విభాగాల్లో టాపర్లుగా విద్యార్థులకు స్వామినాథన్ పేరిట అవార్డు అందచేస్తామని చేస్తామని వెల్లడించారు. తంజావూరులోని ఈచన్‌కోట్టైలో ఉన్న ఇన్స్టిట్యూట్ను డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మారుస్తామని ప్రకటించారు. పద్మవిభూషణ్, మెగసెసే అవార్డులతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతో గౌరవం పొందిన స్వామినాథన్‌ను గౌరవించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.