Jul 06,2023 08:17

చెన్నై: ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నాడిఎంకె స్పష్టం చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి బుధవారం నాడిక్కడ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, 2019 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ పార్టీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నదని,ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ఉమ్మడి సివిల్‌ కోడ్‌ కోసం రాజ్యాంగానికి ఎలాంటి సవరణలు తేవొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో భాగస్వామ్య పక్షంగా అన్నాడిఎంకె ఉన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి సివిల్‌ కోడ్‌ భారత దేశంలోని మైనార్టీల మత పరమైన హక్కులను తీవ్రంగా దెబ్బ తీస్తుందని అన్నాడిఎంకె పేర్కొంది. ఉమ్మడి సివిల్‌ కోడ్‌ను ముందుకు తెస్తూ భోపాల్‌ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై డిఎంకె, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. బిజెపి ముందు హిందువుల్లో ఏకరూపతను తీసుకురమ్మనండి అని డిఎంకె ఎంపి టికెఎస్‌ ఎలంగోవాన్‌ ఇదివరకే వ్యాఖ్యానించారు.