డెహ్రాడూన్ : వివాదాస్పద ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. యుసిసి ముసాయిదాను ప్రవేశపెట్టేందుకు త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు శనివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ముసాయిదా బిల్లులో బహుబార్యత్వాన్ని పూర్తిగా నిషేధించాలని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సహజీవనం చేయాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధన పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఏడాది ప్రారంభంలో ముసాయిదాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ జస్టిస్ రంజన్ దేశారు నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను సిఎం పుష్కర్ సింగ్ ధామికి అందజేయనున్నారు. దీపావళి తర్వాత నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో యుసిసిని ఆమోదించనున్నట్లు సమాచారం.