ట్రెంచ్‌లెస్ సాంకేతికతతో తీసుకొచ్చే యత్నం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయి అందులో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రెండు రోజులు గడిచినా అధికారులు బయటకు తీసుకుని రాలేకపోయారు. మంగళవారం వీరిని బయటకు తీసుకుని రావడానికి భారీ ఎక్స్‌వేటర్లతో ప్రయత్నించారు. అయితే కూలిన టన్నెల్ శిథిలాలు అవరోధంగా మారాయి. మంగళవారం సాయంత్రం నుంచి 'ట్రెంచ్‌లెస్' సాంకేతికత ద్వారా కార్మికులను బయటకు తీసుకుని రావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా తేలికపాటి ఉక్కు పైపులతో మార్గాన్ని ఏర్పాటు చేసి కార్మికులను బయటకు తీసుకుని వస్తామని అధికారులు చెబుతున్నారు. చిక్కుకుపోయిన వారికి ఆహారాన్ని, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. కార్మికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చిక్కుకునిపోయి మూడు రోజులు అవుతుండటంతో కార్మికుల బంధువులు ఆందోళనగా ఉన్నారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా- దండల్‌గావ్‌ను కలిపే లక్ష్యంగా ఉత్తరకాశీ-యమనోత్రి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సొరంగం ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 40 మంది కార్మికులు ఇందులో చిక్కుకుపోయారు. వీరంతా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు చెందిన వారు.