Nov 14,2023 13:42

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ టెన్నెల్‌ వద్ద సహాయక చర్యలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం భారీ డయామీటర్‌ పైపులు, డ్రిల్లింగ్‌ యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆదివారం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం ఆకస్మాత్తుగా కుప్పకూలి దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి విదితమే. వారిని రక్షించేందుకు రెండు రోజులుగా సహాయక బఅందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లీమీటర్ల వ్యాసం పైపులతో కూడిన ట్రక్కులు సిల్కీయారాకు రావడం ప్రారంభించాయి. అయితే ... తాజాగా భారీ డ్రిల్లింగ్‌ మిషన్‌ కూడా చేరుకోవడంతో సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి.

022


                                           ఇంకా 35 మీటర్ల శిథిలాలను తొలగించాలి : అధికారులు

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు వీలుగా శిథిలాల మధ్య పెద్ద వ్యాసం కలిగిన ఎంఎస్‌ పైపులను చొప్పించడానికి ఒక యంత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న 40 మంది కార్మికుల ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకా 35 మీటర్ల శిథిలాలను తొలగించాల్సి ఉందని సహాయక బఅందాలు తెలిపాయి. కాగా ఈ సహాయక చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించారు. చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

                                  పెద్ద డయామీటర్‌ హ్యూమ్‌ పైపులను ఏర్పాటు చేస్తున్నాం : సిఎం ధామి

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి మాట్లాడుతూ ... సహాయక చర్యల కోసం హరిద్వార్‌, డెహ్రాడూన్‌ నుంచి పెద్ద డయామీటర్‌ హ్యూమ్‌ పైపులను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికుల యోగ క్షేమాల గురించి తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి స్వయంగా ఫోన్‌ చేశారని, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని అన్నారు.

        ఈరోజు రాత్రి లోపు 40మందిని బయటకు తీస్తాం : ఉత్తరా కాశీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) అర్పన్‌ యదువంశీ

ఉత్తరా కాశీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) అర్పన్‌ యదువంశీ మాట్లాడుతూ ... ఇప్పటివరకు 60 మీటర్ల శిథిలాల్లో 20 మీటర్లకు పైగా శిథిలాలను తొలగించామని, ఈ రోజు రాత్రి లోపు సొరంగం లోపల చిక్కుకున్న 40 మందిని బయటకు తీస్తామని చెప్పారు. వారికి ఆక్సిజన్‌, ఆహారం, నీరు సహా అన్ని మౌలిక సదుపాయాలను పైపుల ద్వారా కల్పిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని అన్నారు.