Sep 25,2023 22:12

చెన్నై : బిజెపి నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఎ) నుంచి వైదొలుగుతున్నట్లు ఎఐఎడిఎంకె సోమవారం ప్రకటించింది. అలాగే బిజెపితో బంధాన్ని తెంచుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. చెన్నైలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, ప్రధాన కార్యాలయ కార్యదర్శలు, ఎంపిలు, ఎమ్మెల్యేల సమావేశం ముగింపులో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి ఇకె పళినిస్వామి అధ్యక్షతన ఈ సమావేశం సుమారు గంట సేపు జరిగింది. ముగింపు తరువాత పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కెపి మునుసామి విలేకరులతో మాట్లాడారు. గత సంవత్సర కాలం నుంచి బిజెపి రాష్ట్ర నాయకత్వం ఉద్దేశపూర్వకంగా, ఒక పథకం ప్రకారం అన్నాదురై, జయలలిత వంటి నేతలపైన, పార్టీ విధానాలపైన విమర్శలకు దిగుతుందని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ కొత్త కూటమిని ఏర్పాటు చేస్తుందని మునుసామి ప్రకటించారు.