Jul 09,2020 20:13

* గ్లోబల్‌ కంపెనీలకు మోడీ ఆహ్వానం
* ఇండియా గ్లోబల్‌ వీక్‌లో ప్రసంగం


ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని దేశ ప్రజానీకానికి ఉద్బోధ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. విదేశీ కార్పొరేట్‌ రాగం ఆలపిస్తున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని అంతరిక్ష రంగం వరకూ అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తలుపులు బార్లా తెరిచేశామని, ఎర్ర తివాచి కూడా పరిచి సిద్ధంగా ఉన్నామని పెట్టుబడులు పెట్టేందుకు తరలిరండి అని ప్రపంచ బడా కార్పొరేట్‌ సంస్థలను ఆయన సాదరంగా ఆహ్వానించారు. గ్లోబల్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌లో తమ ఉనికిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న 'ఇండియా గ్లోబల్‌ వీక్‌ - 2020' సమావేశంలో గురువారం ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత్‌లో ప్రపంచీకరణ ప్రక్రియ అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. కార్పొరేట్లకు భారత్‌ తరహాలో విస్తృత అవకాశాలను అందిస్తున్న దేశాలు కొన్నే ఉన్నాయని, ఈ అవకాశాలను వినియోగించుకొని పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని గ్లోబల్‌ కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 5000 మంది పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం దేశంలో 'కరోనా' లాక్‌డౌన్‌ తర్వాత భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేర్పు భారతీయులది. సంస్కరణలు, కార్యాచరణ, మార్పులతో అభివృద్ధి చెందుతున్న దేశం మనది' అని ఆయన అన్నారు. ఆరేళ్ల నుంచి చేపడుతున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పన్ను సంస్కరణల వల్ల ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. భారత దేశ ఔషధ పరిశ్రమ దేశానికే కాకుండా, ప్రపంచానికీ ఒక ఆస్తి అని కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ విషయం మరోసారి రుజువు చేసిందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఔషధాల తక్కువ ధరలకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. జియో పాలిటిక్స్‌, బిజినెస్‌, టెక్నాలజీ, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఫార్మా, డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ రంగాల నుంచి దాదాపు 250 మంది ఈ వర్చువల్‌ సమావేశంలో ప్రసంగిస్తారు.