కాజూ ఫ్లవర్
కావాల్సిన పదార్థాలు :
జీడిపప్పు - అరకప్పు, ఫుడ్ కలర్ (ఎరుపు, ఆకుపచ్చ) - చిటికెడు, నెయ్యి - టీస్పూన్, పాలు - టేబుల్‌స్పూన్, పంచదార - పావుకప్పు.
తయారుచేసే విధానం :
జీడిపప్పును మిక్సీలో వేసి, పొడి చేసుకోవాలి. వెడల్పాటి పాన్ తీసుకుని, నెయ్యిరాసి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని, పంచదార వేసి, పాకం తయారుచేయాలి. పాకం తయారయ్యాక జీడిపప్పు పొడివేసి కలపాలి. చిన్నమంటపై కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో స్టవ్‌పై నుంచి దింపి, నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చాలి. మిశ్రమాన్ని ప్లేట్‌లో రెండు సమభాగాలుగా చేసి, ఒకదాంట్లో ఎరుపు, మరొకదాంట్లో ఆకుపచ్చ ఫుడ్ కలర్ వేసి కలపాలి. అదే సమయంలో అర టేబుల్‌స్పూన్ పాలుపోసి కలపాలి. లేదంటే మిశ్రమం చపాతీ పిండిలా అవుతుంది. చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఇప్పుడు ఒక ఉండను కాస్త వెడల్పు చేసి, మరో ఉండను మధ్యలో పెట్టి చుట్టూ కలపాలి. తరువాత కత్తితో ఫ్లవర్ ఆకతిలో కట్ చేయాలి. అంతే కాజూ ప్లవర్ రెడీ!
లౌకీ హల్వా
కావాల్సిన పదార్థాలు :
సొరకాయ - చిన్నది, బాదం - నాలుగైదు పలుకులు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, కోవా - యాభై గ్రాములు, పంచదార - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్ పాలు - 100 ఎంఎల్, కుంకుమ పువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - టీ స్పూన్, ఫుడ్ కలర్ - చిటికెడు, నట్స్ - గార్నిష్ కోసం కొద్దిగా.
తయారుచేసే విధానం :
ముందుగా సొరకాయ పొట్టు తీసేసి, గుజ్జుగా చేసుకోవాలి. విత్తనాలు ఉంటే తీసివేయాలి.
ఒక పాన్‌లో నెయ్యివేసి, కాస్త వేడి అయ్యాక సొరకాయ గుజ్జు వేసి, చిన్నమంటపై వేగనివ్వాలి. కాసేపు వేగిన తరువాత బాదం పలుకులు, జీడిపప్పు వేయాలి. తర్వాత కోవా వేసి కలపాలి. పంచదార, ఉప్పు వేసి మరి కాసేపు వేయించాలి. ఇప్పుడు పాలుపోసి కలియబెట్టాలి. కుంకుమ పువ్వు వేయాలి. మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. చివరగా యాలకుల పొడి వేసి, మరికాసేపు ఉంచి దింపుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి, వేడి వేడిగా తినొచ్చు.
స్వీట్ శంకర్‌పాలీ
కావాల్సిన పదార్థాలు :
మైదా - అరకేజీ, రవ్వ - పావుకేజీ, పాలు - అరకప్పు, నెయ్యి / డాల్డా - కప్పు, పంచదార - 300 గ్రాములు, ఉప్పు - చిటికెడు, నూనె - డీఫ్రైకి సరిపడా.
తయారుచేసే విధానం :
పాన్‌లో నెయ్యి వేసి, కాస్త వేడయ్యాక పాన్‌ను స్టవ్ పైనుంచి దింపాలి. ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు వేయాలి. ఇంకా వేడిచేసి పెట్టుకున్న నెయ్యి వేసి, పాలు పోస్తూ మెత్తటి మిశ్రమంగా వచ్చేంత వరకూ కలపాలి. దానిపై శుభ్రమైన వస్త్రం కప్పి, పావు గంటపాటు పక్కన పెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ చిన్న చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనెపోసి, కాస్త వేడయ్యాక కట్ చేసిన వాటిని వేసి బంగారువర్ణం వచ్చే వరకూ వేయించుకోవాలి. అంతే స్వీట్ శంకర్‌పాలీ రెడీ! ఈ మహారాష్ట్ర స్వీట్ పది రోజుల వరకూ నిల్వ ఉంటుంది. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.