పుట్టగొడుగులు అనగానే ఆహా అనిపిస్తుంది.. కదా! నోరూరుతుంది కూడా.. సహజమైన పుట్టగొడుగులు వర్షాకాలంలో రెండు మూడు నెలలే దొరుకుతాయి. అవి పాము పుట్టల నల్లటి మట్టిమీద తెల్లటి మల్లెమొగ్గల్లా పైకి వస్తాయి. ఇవి సహజంగా చెదల సహాయంతో పండుతాయట. ఇప్పుడు కృత్రిమంగానూ పండిస్తున్నారు. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటితో కూరలే కాక మరికొన్ని రకాలు వండుకోవచ్చు. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కూర..
కావలసినవి : నాటు పుట్టగొడుగులు - 1/4 కేజీ, నూనె - 4 స్పూన్లు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి - 2 చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, పసుపు - 1/4 స్పూను, ఉప్పు - తగినంత, కారం - స్పూను, ధనియాల పొడి - స్పూను, జీలకర్ర పొడి - 1/2 స్పూను, గరం మసాలా - 1/2 స్పూను, కొత్తిమీర తరుగు - కొంచెం.
తయారీ : బాండీలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి కాస్త మెత్తబడేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి, కూరను ఒకసారి కలిపి మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్న పుట్టగొడుగులు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత టీ గ్లాసు నీళ్ళు పోసి, కూరను కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి. కూర దగ్గరగా ఉడికిన తర్వాత గరమ్ మసాలా, కొత్తిమీర తరుగు వేయాలి. నిమిషం పాటు ఉడకనిచ్చి కూరను దింపేయాలి. అంతే యమ్మీ యమ్మీ పుట్టగొడుగుల కూర రెడీ.
చిల్లీ మష్రూమ్..
కావలసినవి : పుట్టగొడుగులు - 1/4, మైదా - 4 స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1/2 స్పూను, ఉప్పు - తగినంత, కారం - 1/2 స్పూను, గరం మసాలా - స్పూను, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 10, ఉల్లిపాయలు - 2, నిమ్మ చెక్క- 1
తయారీ : ముందుగా మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అన్నింటినీ నీటితో ఉండలు లేకుండా జారుగా కలుపుకొని, పక్కనుంచుకోవాలి.
ముందుగా శుభ్రం చేసిన పుట్టగొడుగులను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. (నాటువి అయితే కట్ చేయనక్కర్లేదు). బాండీలో నూనె కాగిన తర్వాత ఈ ముక్కలను మైదా మిశ్రమంలో ముంచి, ఒక్కొక్కటిగా నూనెలో దోరగా వేయించాలి. అన్నీ వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో మూడు స్పూన్ల నూనె వేడిచేసి, అల్లం, వెల్లుల్లి, నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు, కరివేపాకు వేసి స్టౌ హైఫ్లేంలో ఉంచి, నిమిషం పాటు వేయించాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత దానిలో ఉప్పు, వెనిగర్, సాస్‌లన్నీ వేసి కలియ తిప్పాలి. అంతే చిల్లీ మష్రూమ్ రెడీ.!
కబాబ్స్..
కావలసినవి : పుట్టగొడుగులు - 1/4, గరం మసాలా - స్పూను, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 2, నిమ్మ చెక్క , ఉప్పు - తగినంత, కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్లు.
తయారీ : శుభ్రం చేసిన పుట్టగొడుగులను ఒక వెడల్పు పాత్రలోకి తీసుకొని గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వాటికి బాగా పట్టేలా కలపాలి. ఒక నిమ్మచెక్క రసం, ఉప్పు, ఇష్టమైతే ఫుడ్ కలర్, పసుపు, కార్న్‌ఫ్లోర్ వేసి మళ్ళీ పుట్టగొడుగుల మిశ్రమాన్ని బాగా కలపాలి. అవసరాన్ని బట్టి స్పూను నీటిని వేసుకోవచ్చు.. బాండీలో నూనె వేడెయ్యాక పుట్టగొడుగులను విడివిడిగా ఎర్రగా వేగేంత వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే స్పైసీ పుట్టగొడుగుల కబాబ్స్ రెడీ! చివరిగా అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి దోరగా వేయించి కబాబ్స్‌తో తింటే బాగుంటుంది.