Jul 23,2023 17:11

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడిగా మొక్కజొన్న కండె కాల్చుకు తింటుంటే.. వేడి వేడి మసాలా కార్న్‌ నోట్లోకి వేసుకుంటుంటే.. ఆహా! ఏమి రుచి.. అనిపిస్తుంది కదూ.. మరి అంతేగా.. ఎప్పుడూ ఒకే రకం తినాలంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. ఓపిక, తీరిక ఉండాలేగానీ ఈ రోజుల్లో ఎన్ని చేసుకోవచ్చు..! సీజన్‌బట్టి కొన్ని పంటలు పండుతాయి. వాటిలో మొక్కజొన్న ఒకటి. ఈ కండెలతో ఎన్నో కమ్మని రుచులు చేసుకోవచ్చు. వాటిలో కొన్నింటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..!

దోశలు..

dosa

కావలసినవి: మొక్కజొన్న గింజలు - 1.5 కేజీ, బియ్యం - 1.5 కప్పు, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - 4, జీలకర్ర - స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 12, పసుపు - 1.4 స్పూను, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయ. కరివేపాకు, కొత్తిమీర తరుగు
తయారీ: ముందుగా మొక్కజొన్న గింజెలను, బియ్యం కడిగి, నీళ్లుపోసి గంటసేపు నానబెట్టాలి. నానిన వీటిలో ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి, కొద్దిగా నీరు పోస్తూ మిక్సీ జార్‌లో కొంచెం బరకగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయ, కొత్తిమీర తరగు, కరివేపాకు కలపాలి. ఇది దోశెల పిండికన్నా కొంచెం చిక్కగా ఉండాలి. దీనిని పెనంపై మరీ పలుచగా కాకుండా అట్టులా కాస్త మందంగా ఉండేలా పోసుకోవాలి. అట్టు రెండువైపులా ఎర్రగా కాల్చుకుంటే చాలా రుచిగానూ, హెల్దీగానూ ఉంటుంది. ఇది టమాటా, వంకాయ, కొత్తిమీర పచ్చళ్ళతో చాలా బాగుంటుంది.

హల్వా..

halwa

కావలసినవి: మొక్కజొన్న గింజలు - 1.5 కప్పు, పాలు - 1.5 కప్పు, పంచదార - 1.5 కప్పు, నెయ్యి - 3 స్పూన్లు, యాలుకల పొడి - 1.5 స్పూను, డ్రై ఫ్రూట్స్‌ పలుకులు - 2 స్పూన్లు
తయారీ : ముందుగా మొక్కజొన్న గింజలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేడి చేసి డ్రైఫ్రూట్‌ పలుకులు వేయించి, గిన్నెలో పక్కనుంచుకోవాలి. అదే బాండీలో మరికొంచెం నెయ్యి వేయాలి. దీనిలో మొక్కజొన్న గుజ్జును వేసి, పచ్చివాసన పోయేంత వరకు తిప్పుతూ వేయించాలి. కొంచెం రంగు మారి, బాండీకి అంటకుండా చూసుకోవాలి. పదార్థం దగ్గరగా వచ్చిందన్న తర్వాత దానిలో పాలు పోసి నెమ్మదిగా కలుపుతూ అడుగంటకుండా ఉడికించాలి. పాలతో బాగా ఉడికి చిక్కబడిన తర్వాత పంచదార వేయాలి. పంచదార కరిగి ఉడుకుతున్న సమయంలో యాలకల పొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ఈ ప్రాసెస్‌ అంతా స్టౌ సిమ్‌లో ఉంచి మాత్రమే చేయాలి. అంచుల వెంబడి నెయ్యి కనిపించిన వెంటనే నెయ్యి రాసిన ప్లేటులోకి హల్వాను పోసి, సరిచేయాలి. దానిపై ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ పలుకులతో గార్నిష్‌ చేయాలి. అంతే కమ్మనైన మొక్కజొన్న గింజల హల్వా రెడీ.

కూర..

curry

కావలసినవి : బేబీకార్న్‌ - 200 గ్రా., నూనె - 3 స్పూన్లు, జీలకర్ర - స్పూను, ఎండుమిర్చి, ఉల్లిపాయలు - 2, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - స్పూను, ఉప్పు-తగినంత, ధనియాల పొడి - స్పూను, గరంమసాలా - 1/2 స్పూను, కారం-2 స్పూన్లు, వేయించిన జీలకర్ర పొడి - 1/2 స్పూను, పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్లు, టమాటాలు - 2, పసుపు - 1/4 స్పూను, జీడిపప్పు పేస్ట్‌ - 2 స్పూన్లు, నీళ్ళు - 200 ఎం. ఎల్‌., కొత్తిమీర తరుగు - 2 స్పూన్లు, చిలికిన మీగడ - 1/4కప్పు, నెయ్యి - 4 స్పూన్లు
తయారీ.. బేబీకార్న్‌ ముక్కల్ని ముప్పాతిక వంతు ఉడకబెట్టాలి. బాండీలో నూనె వేడిచేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ పచ్చివాసన పోయేంతవరకూ వేయించాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, వేయించిన జీలకర్రపొడి వేయాలి. అవి బాగా వేగి, నూనె పక్కకు వచ్చేవరకూ వేపాలి. పచ్చిమిర్చి తరుగు, టమాటాప్యూరీ, పసుపు, జీడిపప్పు పేస్ట్‌ వేసి కలుపుతూ వేయించాలి. ఇప్పుడు నీళ్ళు పోసి మంట పెంచి, నీళ్ళు మరిగేంతవరకూ ఉడకనివ్వాలి. కళపెళ ఉడికేటప్పుడు బేబీకార్న్‌ ముక్కలను వేసుకోవాలి. చివరిలో చిలికిన మీగడ, నెయ్యి, కొత్తిమీర వేసి, ఒకసారి కూరంతా తిప్పాలి. కూర దగ్గరకు వచ్చేంత వరకూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే రుచికరమైన బేబీకార్న్‌ మసాలా కర్రీ రెడీ.