శరీరానికి మేలు చేసే సీఫుడ్‌లో రొయ్యలు వెరీ స్పెషల్. ఈ వర్షాకాలంలో ఎండు రొయ్యపొట్టు మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. దీంతో కూర, బిర్యానీలే కాదు కారం కూడా చేసుకోవచ్చు. అయితే సన్నగా, చిన్నగా ఉండే ఈ రొయ్యపొట్టును శుభ్రం చేసుకోవడం కొంచెం కష్టం. కానీ ఇందులో ఉన్న బి12 విటమిన్ వల్ల రక్తనాళాలు శుభ్రపడతాయి. వీటిలో ఉండే పోషకాలు వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వీటిని ఎలా శుభ్రం చేయాలో, ఎన్ని రకాలుగా వండుకోవాలో తెలుసుకుందాము.
- శుభ్రం చేయడం ఇలా..
రొయ్యపొట్టును ఒక చేటలో వేసుకోవాలి. పనికిరానివి ఏరేశాక పొట్టు మొత్తాన్ని చేత్తో నలపాలి. దాంతో ఇసుక ఉంటే చేటలో రాలిపోతుంది. అది పోయేలా చెరగాలి. తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిలో ఈ రొయ్య పొట్టు మొత్తం మునిగేలా చూసుకోవాలి. ఐదు నిమిషాలు నానబెట్టాలి. తర్వాత పొట్టు మొత్తం పిసుకుతూ కలపాలి. పొట్టుకు ఉన్న సన్నని ఇసుక నీటి అడుగుభాగానికి చేరుతుంది. నీటిపై రొయ్య పొట్టు తేలుతుంది. నీటిని పిండుకుంటూ పొట్టును తీసి మరొక గిన్నెలో వేసుకోవాలి. ఇలా మూడు, నాలుగు సార్లు రొయ్య పొట్టును నీళ్లల్లో వేసి శుభ్రం చేసుకోవాలి.
కారప్పొడి
కావల్సినవి : రొయ్యపొట్టు - 1 1/2 కప్పు , నువ్వులు - అరకప్పు, ఎండుమిర్చి - 10-15, ధనియాలు - స్పూను, నూనె - స్పూను, జీలకర్ర - స్పూను, వెల్లుల్లి రెమ్మలు- పావుకప్పు , ఉప్పు - తగినంత.
తయారీ : బాండీని పొయ్యి మీద పెట్టి వేడి చెయ్యాలి. సన్నమంట మీద నువ్వులు వేయించి, ఒక ప్లేట్లో ఆరబెట్టాలి. శుభ్రం చేసుకున్న రొయ్యపొట్టును వేసి వేయించాలి. దీన్ని మరొక ప్లేట్లో ఆరబెట్టాలి. అదే బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి మొత్తం చల్లారాక మిక్సీ జార్‌లో వేసి, గ్రైండ్ చేయాలి. తర్వాత రొయ్యపొట్టు, నువ్వులు వేసి గ్రౌండ్ చేయాలి. చివరిగా వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అంతే రొయ్యపొట్టు కారప్పొడి రెడీ. ఇది రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది.
ఇగురు
కావల్సినవి : రొయ్యపొట్టు - 200 గ్రా||, జీలకర్ర - రెండు స్పూన్లు, ధనియాలు - రెండు స్పూన్లు, వెల్లుల్లి రెమ్మలు - ఎనిమిది, ఉల్లిపాయలు - రెండు, మిర్చి- మూడు, నూనె - స్పూను, కారం - స్పూను, ఉప్పు - తగినంత, పసుపు - అర స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ : ముందుగా ఉల్లిపాయలు ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రం చేసుకున్న రొయ్యపొట్టు, ఉప్పు, కారం, పసుపు, మిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, మసాల పేస్ట్ (ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు కలిపి) వేసి కలుపుకోవాలి. పొయ్యి మీద ఒక బాండీ పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. ముందు కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కలిపిపెట్టుకున్న రొయ్య పొట్టు వేయాలి. గరిటెతో కలుపుతూ సన్న మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత టీ గ్లాసు నీళ్లు పోసి, మూత పెట్టి పావుగంట ఉడికించాలి. అంతే వేడి వేడిగా రొయ్యపొట్టు ఇగురు రెడీ.
వంకాయతో పులుసు
కావలసినవి : రొయ్యపొట్టు - 100 గ్రా||, వంకాయలు - 1/4 కేజీ, నూనె - నాలుగు స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, టమాట - ఒకటి, కారం - రెండు స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు- స్పూను, చింతపండు - నిమ్మకాయ సైజు, కారం - స్పూను, మెంతులు - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ : ముందుగా చింతపండుని వేడినీళ్ల వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడిచేయాలి. మెంతులు వేసి చిటపటలాడాక, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. టమాట ముక్కలతో పాటు కొంచెం ఉప్పు వేసి, మెత్తగా వేగనివ్వాలి. రొయ్యపొట్టు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు, పసుపు వేసి మొత్తం కలపాలి. మూతపెట్టి వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి, కారం వేసి కలపాలి. చింతపండు పులుసు పోసి, రుచికి తగిన ఉప్పు వేసి, గ్లాసు నీళ్లు పోసి మొత్తం కలపాలి. మూత పెట్టి పులుసు చిక్కబడే వరకూ ఉడకనివ్వాలి. అంతే రొయ్యపొట్టు వంకాయ పులుసు రెడీ.