
- తహసీల్దార్ కార్యాలయానికి కంప్యూటర్ బహుకరణ
ప్రజాశక్తి-చల్లపల్లి. ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్ బాబు సేవలు ప్రశంసనీయమని చల్లపల్లి తహసీల్దార్ కె. గోపాలకృష్ణ అన్నారు. బుధవారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామానికి చెందిన ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వేములపల్లి సురేష్ బాబు రూ.40వేలు విలువ కలిగిన నూతన కంప్యూటరును తహసీల్దార్ కే.గోపాలకృష్ణకు ఈ కంప్యూటరు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత నిరుపేదల సేవలో తరిస్తున్న పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ సేవా సంస్థ డైరెక్టర్ వేములపల్లి సురేష్ బాబు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తనవంతు సహాయ సహకారాలు ప్రతినిత్యం అందిస్తూనే ఉన్నారని తెలిపారు.గతంలో చల్లపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి ప్రింటర్ అందించారని తెలిపారు. దీంతో పాటు కార్యాలయ ప్రాంగణంలో లక్షలాది రూపాయల వ్యయంతో వీఆర్వో భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు.
- కోవిడ్ సమయంలో సంపూర్ణ సహకారం
కరోనా సమయంలో రెండేళ్లపాటు ఫ్రంట్ లైన్ వారియర్లకు తన వంతు సహాయ సహకారాలు ప్రతినిత్యం అందిస్తూ మాస్కులు, శానిటైజర్లు ఎప్పటికప్పుడు సమకూరుస్తూ అండగా నిలిచారని గుర్తు చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖలకు, గ్రామ వాలంటీర్లకు సురేష్ అందించిన సేవలు ప్రశంసనీయమని తహసిల్దార్ గోపాలకృష్ణ అన్నారు. పురిటిగడ్డ కేంద్రంగా గత కొన్నేళ్లుగా ఇండియా విలేజ్ వినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వితంతువులు, నిరుపేదలు, వృద్ధులు, మహిళలకు, పేద విద్యార్థులకు సురేష్ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.