Mar 17,2023 12:20

ముంబయి  :   దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌)లో ఊహించని పరిణామం జరిగింది. టిసిఎస్‌ సిఇఒ పదవికి రాజేష్‌ గోపీనాథన్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కె. కృతివాసన్‌ను ఇన్‌చార్జి సిఇఒగా నియమిస్తూ కంపెనీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే టిసిఎస్‌ సిఇఒ పదవికి రాజేష్‌ గోపీనాథన్‌ రాజీనామాకు గల కారణాలు తెలియలేదు. ఆయన పదవీకాలం మరోనాలుగేళ్లు ఉండగా.. ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. రాజేష్‌ గోపీనాథన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ టిసిఎస్‌లోనే కొనసాగుతారని, తదుపరి సిఇఒకు మార్గనిర్దేశం చేస్తారని సంస్థ వెల్లడించింది. ఇక టిసిఎస్‌ సంస్థకు చెందిన బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెస్స్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్న కె.కృతివాసన్‌ టిసిఎస్‌ సిఇఒగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు.

ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడు మోహిత్‌ జోషి ఇటీవలే రాజీనామా చేసి టెక్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియామకమైన నాలుగు రోజుల్లోనే టిసిఎస్‌ సిఇఒ రాజీనామా చేయడం గమనార్హం.  టిసిఎస్‌ సంస్థ సిఇఒగా తనకు ఈ ఆరేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని రాజేష్‌ గోపీనాథన్‌ తెలిపారు. భవిష్యత్తులో ఏం చేయాలనే అంశంపై తనకు కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని అన్నారు. సంస్థలో తనది 22 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన ప్రయాణమని చెప్పారు. తన హయాంలో సంస్థ ఆదాయం 10 బిలియన్‌ డాలర్ల మేర పెరిగిందని, మార్కెట్‌ విలువ 70 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి   చెందిందని పేర్కొన్నారు.