- ఇజ్రాయిల్‌కు ఆయుధాలు పంపాలన్న బైడెన్ చర్యకు నిరసన
వాషింగ్టన్ : ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరాను కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ చర్యకు నిరసనగా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం రాజీనామా చేశారు. గాజాను దిగ్బంధించి అక్కడ సామూహిక మారణకాండను, మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్న ఇజ్రాయిల్‌కు ఆయుధాలను, మందుగుండు సరఫరాను కొనసాగించడాన్ని విదేశాంగ శాఖలో రాజకీయ - సైనిక వ్యవహారాల బ్యూరో, ప్రజా వ్యవహారాల విభాగ డైరెక్టర్‌గా 11ఏళ్ల నుంచి పనిచేస్తున్న జోష్ పాల్ గట్టిగా వ్యతిరేకించారు. బైడెన్ ప్రభుత్వం ఒక వైపు కొమ్ముకాస్తూ, ఇజ్రాయిల్ నేరాలను గుడ్డిగా సమర్థించడానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని పాల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ వైఖరి మనం బయట ప్రజలకు చెప్పే నీతులకు పూర్తి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గత అనేక దశాబ్దాలుగా మనం చేసిన తప్పులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం అదే తప్పు చేస్తున్నదని, ఇందులో భాగస్వామి కావడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని ఒక ఇంటర్వ్యూలో పాల్ పేర్కొన్నారు.