Oct 29,2023 15:37

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. నాగం జనార్ధన్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్‌ వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్‌ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది.కాంగ్రెస్‌ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్‌ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్‌ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు.