వాషింగ్టన్ : అభిశంసన ద్వారా నాలాంటివారి నోర్మూయించాలనుకోవడం అవివేకమని అమెరికా ప్రతినిధుల సభకు మిచిగాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పాలస్తీనియన్ రషీదా తాలిబ్ పేర్కొన్నారు. తక్షణమే కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినందుకు తాలిబ్‌పై అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో రిపబ్లికన్లు అభిశంసన ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 212 మంది రిపబ్లికన్లు, 22 మంది డెమొక్రాట్లు ఓటు చేయగా, వ్యతిరేకంగా 188 మంది డెమొక్రాట్లు, నలుగురు రిపబ్లికన్లు ఓటు వేశారు. అభిశంసన తీర్మానంపై చర్చ సందర్భంగా తాలిబ్ చేసిన ప్రసంగం ఉత్తేజపూరితంగా సాగింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ అమెరికా అంతటా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. ఈ ఉద్యమం రోజు రోజుకీ విస్తరిస్తోంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ వైట్ ఫాస్పరస్ వంటి అత్యంత ప్రమాదకర రసాయనాలను ప్రయోగిస్తోంది. దీనిని మీరు సమర్ధిస్తారా? మిచిగాన్‌లో 71 శాతం మంది డెమొక్రాట్లు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతున్నారు, వాళ్లందరి నోళ్లు మీరు మూయించగలరా? అని ఆమె తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. తనకు ఈ శక్తి తాను మాట్లాడే సత్యం నుంచి వచ్చినదే నని ఆమె అన్నారు. ఇది మతాలు, జాతులు, ప్రాంతాలకు సంబంధించిన అంశం కాదు, యావత్ మానవాళికి, శాంతికి సంబంధించిన అంశమిది అని ఆమె అన్నారు.