Nov 05,2023 15:26

మదిర: కాంగ్రెస్‌ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండలం, మధిర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పి, అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్‌,ఆయన కుటుంబం, బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను దోపిడీ చేసి ఖజానాను లూటీ చేశారన్నారు. తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ప్రజల కలలను కల్లలుగా మార్చిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రజల తెలంగాణ ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రజల సంపద ప్రజలకే పంచడానికి కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలను తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుపడాలన్నదే కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు. కులమత రాజకీయాలకతీతంగా అందరి అభివఅద్ధి చేసేటువంటి కాంగ్రెస్‌ ను ఎన్నికల్లో గెలిపించాలన్నారు.దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టి మైనార్టీలకు రక్షణగా నిలుస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. దేశంలో హిందూ, ముస్లిం భాయి, భాయి అంటూ సోదర భావాన్ని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్సే అని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. ప్రశ్న పత్రాలు లీకేజీ లేకుండా టిఎస్‌పిఎస్‌సి ద్వారా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ దేశ భవిష్యత్తు యువకులదే వారి భవిష్యత్తుకు కాంగ్రెస్‌ గ్యారెంటీ ఇస్తుందన్నారు.