న్యూఢిల్లీ : అండమాన్, నికోబర్ దీవుల ప్రధాన కార్యదర్శి కేశవ్ చంద్రను సస్పెండ్ చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అలాగే అండమాన్, నికోబర్ లెఫ్టినెంట్ గవర్నర్ డి.కె. జోషి రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఇచ్చిన ఉత్తర్వులపై కూడా స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. వాస్తవానికి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడే ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని, ఈ రెండు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. వచ్చే వారం విచారణకు జాబితా చేయనున్నామని, సస్పెండ్ చేయడం, జరిమానా విధించడం రెండూ కూడా కొంచెం తీవ్రమైనవేనని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 11కి వాయిదా వేసింది. సుమారు 4,000 మంది డైలీ రేటెడ్ మజ్దూర్ (డిఆర్‌ఎం)లకు అధిక వేతనాన్ని అందించాలంటూ కోల్‌కతా హైకోర్టు గతేడాది డిసెంబర్ 19 ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే డిఆర్‌ఎంలకు 2017 నుండి పెండింగ్‌లో ఉన్న పెంచిన డిఎలను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రెండు ఉత్తర్వులను పాటించడంలో అండమాన్, నికోబర్ దీవుల ప్రధాన కార్యదర్శి కేశవ్ చంద్ర, ఎల్‌జి డికె.జోషిలు విఫలమయ్యారని... దీంతో కేశ్ చంద్రను సస్పెండ్ చేస్తూ, ఎల్‌జి డి.కె.జోషి రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు ఉత్తర్వులపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.