Oct 22,2023 09:15

న్యూఢిల్లీ : మూడు మాసాల శిశువుపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో వ్యక్తిని దోషిగా నిర్ధారించడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో తాజాగా విచారణ జరపాలని ఆదేశించింది. నిందితుడికి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా కేసు విచారణను ముగించేసినట్లు వుందని వ్యాఖ్యానించింది. 2018లో నమోదైన ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలైన తేదీ నుండి కేవలం 15రోజుల వ్యవధిలో విచారణ సాగిందని కోర్టు పేర్కొంది. ట్రయల్‌ కోర్టు నిందితుడిని అనేక నేరాల్లో దోషిగా నిర్ధారించి, మరణ శిక్ష విధించిందని తెలిపింది. నిందితుడికి తనను తాను సమర్ధించుకునేందుకు సరైన అవకాశం ఇవ్వకుండా చాలా హడావిడిగా విచారణ ముగించేసినట్లు కనిపిస్తోందని, అటువంటప్పుడు ఆ విచారణ అర్ధరహితంగా వుంటుందని జస్టిస్‌ బిఆర్‌ గవారు నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది. అందువల్ల ఈ కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతున్నామని, తిరిగి విచారణ జరపాల్సిందిగా ట్రయల్‌ కోర్టును ఆదేశిస్తున్నామని బెంచ్‌ తెలిపింది. పిటిషనర్‌ నవీన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పై తీర్పు వెలువరించింది.