Jul 05,2023 22:25
  • విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌కు సుప్రీం నోటీసులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సెప్టెంబర్‌ 5 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో సిబిఐ నమోదు చేసిన కేసుల విచారణ ముగిసే వరకు ఇడి కేసుల విచారణ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అభయ్ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజరు కరోల్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్‌ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌లకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసు పూర్తి స్థాయి విచారణను ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలా అన్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్‌ 5కి తదుపరి విచారణ వాయిదా వేసింది. అలాగే జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఇడి సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను విడిగా ఈనెల 14న జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. సిబిఐ నమోదు చేసిన కేసులు, ఈడి నమోదు చేసిన కేసులు సమాంతరంగా విచారణ కొనసాగించవచ్చునని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 2021లో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముందుగా సిబిఐ కేసులు విచారించాలని, అప్పటి వరకు ఇడి నమోదు చేసిన కేసుల విచారణ ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ సిబిఐ, ఈడి నమోదు చేసిన కేసుల విచారణ సమాంతరంగా జరిపితే, ముందుగా సిబిఐ కేసులపై తీర్పు ఇచ్చిన తర్వాతే, ఇడి కేసులపై తీర్పు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో ఇడి సవాల్‌ చేసింది.