Nov 06,2022 10:30

ప్రజాశక్తి-అమరావతి : ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఇపిఎస్‌)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని పరిమితులకు లోబడి ఉందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ కుమార్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ప్రధాన అంశాలు, ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు, నష్టాలు తదితర అంశాలపై ఆయనను ప్రజాశక్తి సంప్రదించగా, పలు కీలక అంశాలను వివరించారు. ఆ అంశాలిలా ఉన్నాయి.
ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఇపిఎస్‌) సభ్యులకు ఈ నెల 4న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని పరిమితులకు లోబడి ఉంది. తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దీనికి తార్కాణంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని పెన్షన్‌ స్కీమ్‌కు కంట్రిబ్యూట్‌ చేయాలని సిఫార్సులు చేయలేమని చెప్పింది. దానికి తగ్గ చట్టం లేకుండా తాము చేయగలిగిందేమీ లేదన్నది. 2014లో మోడీ ప్రభుత్వం పెన్షన్‌కు అర్హమైన వేతన లెక్కింపుకు అంతకు ముందున్న 12 నెలల వేతన సరాసరిని 60 నెలలకు పెంచుతూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనిలో ఎటు వంటి చట్ట వ్యతిరేక చర్య లేదని చెప్పింది. పెన్షన్‌ నిధుల లభ్యతను బట్టి పెన్షన్‌ ఉంటుందనే ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ వాదనను అంగీకరించింది. పెన్షన్‌ నిర్ణయానికి ఉన్న ఫార్ములాను సమర్థించింది. ఈ ఫార్ములా వల్లే ఇపిఎస్‌ పెన్షన్‌ అతి తక్కువ స్థాయిలో వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆఖరి వేతనంలో 50 శాతం బేసిక్‌ పెన్షన్‌గా ఇపిఎస్‌ పెన్షనర్లకు రాదు. వీరికి డిఎ కూడా లేదు.
వీరికి వచ్చే పెన్షన్‌ను కనీసంగా రూ.1000/- కు పెంచామని కేంద్ర ప్రభుత్వాలు చెప్పుకున్నప్పటికీ ఆ వెయ్యి కూడా చాలామందికి రావడం లేదు. కనీస పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు అంగీకరించలేదు. ఇపిఎస్‌ పెన్షనర్లు కోరుతున్న కనీస పెన్షన్‌ రూ.9 వేలు అందని ద్రాక్షగా మారింది.
ఇపిఎస్‌ పెన్షనర్లకు పెన్షన్‌ ఫార్ములా - పెన్షన్‌ అర్హత వేతనం × సర్వీసు చేసిన సంవత్సరాలు క్ష్మి 70 = నెలవారీ పెన్షన్‌. 2014 కు ముందు పిఎఫ్‌ / పెన్షన్‌కు వేతన పరిమితి రూ.6,500/- (బేసిక్‌ మరియు డీఏ). దీని ప్రకారం ఉద్యోగికి ఎంత వేతనం వచ్చినా సరే రూ.6,500/- మీద లెక్క వేస్తే వచ్చే పెన్షన్‌ ఎంత ఉంటుందన్నప్పుడు ఆ ఉద్యోగి 30 సంవత్సరాలు సర్వీసు చేసి ఉంటాడు అనుకుంటే 6,500 × 30 క్ష్మి 70 = 2,785. ఈ పరిమితిని 2014 సెప్టెంబర్‌ 1 నుంచి రూ. 15 వేలకు పెంచారు. 2014 తర్వాత సర్వీసులో చేరి ఉంటే 30 సంవత్సరాల పాటు వేతనం కనీసం రూ. 15 వేలు వచ్చి ఉంటే వచ్చే పెన్షన్‌ 15,000 × 30 క్ష్మి 70 = 6,428/-. వీటిపై డిఎ రాదు. ఎన్నాళ్ళు ఉన్నా పెన్షన్‌ అలాగే ఉంటుంది. ప్రభుత్వం విధించిన పరిమితికి మించి వేతనాలపై అదనపు చెల్లింపులు చేయడానికి సిద్ధపడే యజమానులు చాలా తక్కువ మంది ఉంటారు.
ఈ తీర్పు ప్రధానంగా పెన్షన్‌ పెంపునకు సంబంధించినది కాదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలి.

  • తీర్పులోని ముఖ్యాంశాలు

- 2014 ఆగస్టులో మోడీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ సరైనదే. దానిలో కొన్ని మార్పులు చేయాలి. ఈ మార్పులు ప్రస్తుతం ఉన్న సభ్యులకు మాత్రమే వర్తిస్తాయి.
- నోటిఫికేషన్‌లోని పిఎఫ్‌ పరిమితి రూ.15 వేలకు మించి అధిక స్థాయి చెల్లింపులు చేయడానికి ఉద్యోగులకు, యజమానులకు ఇచ్చిన ఆప్షన్‌ గడువును ఈ నెల 4 నుంచి మరో నాలుగు నెలలకు పొడిగించింది.
- 2014 సెప్టెంబర్‌ 1 కి ముందు పదవీ విరమణ చేసిన వారు రూ.6,500/- పరిమితికి మించి పిఎఫ్‌ / పెన్షన్‌కు
ఉద్యోగులు, యజమానులు చెల్లింపు చేసి ఉంటే వారు ఆ చెల్లింపుల ప్రకారం అధిక పెన్షన్‌కు అర్హులు.
- మినహాయింపు పొందిన సంస్థలు, మినహాయింపు పొందని సంస్థలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.
- 2014 నోటిఫికేషన్‌ ప్రకారం రూ.15 వేలకు మించి ఉభయులు చెల్లింపులు చేస్తే, ఇంతకు ముందులాగా అధిక చెల్లింపులు చేసిన వారికి వర్తించే 1.16 శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లించదు. దానిని ఉద్యోగులే భరించాలి. కానీ ఈ ప్రొవిజన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్‌ ప్రకారం తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని ఈ ప్రొవిజన్‌ను కొట్టేసింది. ఈ 1.16 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం కట్టే విధంగా (సుప్రీంకోర్టు సూచన) ఆరు నెలల పాటు లేదా చట్టంలో మార్పులు చేసే వరకు ఉద్యోగుల నుంచి వసూలు చేయడాన్ని నిలిపేసింది.

  • ఇతర అంశాలు

- 2014కు ముందు రిటైర్‌ అయిన వారు సర్వీసులో ఉండగా రూ. 6,500/- మించి చెల్లింపులు చేసి ఉండకపోతే వారు అధిక పెన్షన్‌కు అర్హులు కారు. ఇది 2016లో ఆర్‌.సి.గుప్త కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఉంది.
- పెన్షన్‌ సంస్కరణల అమల్లో భాగంగానే 1995లో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ వచ్చింది. కార్మిక సంఘాలు కోరినట్లుగా పెన్షన్‌ను మూడో బెనిఫిట్‌ (మేనేెజ్‌మెంట్‌ పిఎఫ్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌)గా ఇవ్వకుండా మేనేజ్‌మెంట్‌ కంట్రిబ్యూషన్‌ తీసుకుని కొద్దిపాటి పెన్షన్‌ వచ్చే స్కీమే ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఇపిఎస్‌)ను అప్పటి పి.వి.నర్సింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెన్షన్‌ ఫండ్‌ను బట్టి పెన్షన్‌ వస్తుంది తప్ప దీనిలో ప్రభుత్వానికి, యజమానులకు బాధ్యత లేదు.
- 2004 జనవరి 1 నుంచి సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ లేదు. 2004 సెప్టెంబర్‌ 1 మరియు ఆ తర్వాత చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెన్షన్‌ లేదు. 2010 ఏప్రిల్‌ 1 ఆ తర్వాత చేరిన బ్యాంకు, ఇన్సూరెన్స్‌ ఉద్యోగులకు పెన్షన్‌ లేదు. వీరందరూ సిపిఎస్‌లో ఉన్నారు. సిపిఎస్‌ అంటే పెన్షన్‌ లేనట్లే.
- ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ బోర్డును కార్పొరేషన్లుగా విడగొట్టిన తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు, టెలికాం డిపార్ట్‌మెంట్‌ బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ గా మారిన తర్వాత చేరిన బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం లేదు. వీరికి ఇపిఎస్‌ పెన్షన్‌ మాత్రమే వస్తుంది.
- ఇటువంటి పరిస్థితుల్లో సర్వీసులో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల మధ్య గరిష్ట ఐక్యత సాధించాల్సి ఉంది.